ఈ వారమూ గీత గోవిందులేనా?

ఈ వారమూ గీత గోవిందులేనా?

మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా వీకెండ్ తర్వాత వీక్ అయిపోతుంటాయి. అందులోనూ ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌ ఉండేలా రిలీజైన సినిమాలు సోమవారానికి జోరు తగ్గించేస్తుంటాయి. కానీ గత వారం రిలీజైన ‘గీత గోవిందం’ మాత్రం ఆదివారం తర్వాత కూడా అదరగొడుతోంది. సోమ, మంగళవారాల్లో ఈ చిత్రం రూ.6 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. దాని ఊపు చూస్తుంటే ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాలకు కూడా దడ పుట్టేలా ఉంది.

ఈ శుక్రవారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఓ మోస్తరుగా ఆకర్షిస్తున్నదంటే.. ‘నీవెవరో’ మాత్రమే అని చెప్పాలి. ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో హరినాథ్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకర్షించింది. ఐతే హీరోగా ఆదికి పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందన్నది సందేహంగా ఉంది. బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. టాక్ బాగుంటే పరిస్థితి మారొచ్చు.

ఇక మిగతా మూడు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నారా రోహిత్ వరుస ఫ్లాపులతో వెనుకబడిపోవడం, పేలవమైన ట్రాక్ రికార్డున్న పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ‘ఆటగాళ్ళు’పై అంచనాలు తక్కువే ఉన్నాయి. జగపతిబాబు కూడా ఈ చిత్రానికి ఆకర్షణ తేలేకపోయాడు. దీనికి బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. ఇక రష్మి సినిమా ‘అంతకుమించి’.. ప్రభుదేవా డబ్బింగ్ మూవీ ‘లక్ష్మి’ల గురించి డిస్కషనే లేదు.

పరిస్థితి చూస్తుంటే ఈ వీకెండ్లో కూడా ‘గీత గోవిందం’ జోరే సాగేలా ఉంది. దాని బుకింగ్స్ బాగున్నాయి. ఈ వీకెండ్లో వచ్చే సినిమాల్లో వేటికైనా చాలా మంచి టాక్ వస్తే తప్ప ‘గీత గోవిందం’ దూకుడు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఈ వారాంతంలోనే ఆ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు