మహేష్ ఆయన్ని మరిచిపోలేదు

మహేష్ ఆయన్ని మరిచిపోలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య తనకు కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ సంబంధం లేని సినిమాలకు కూడా సపోర్టిస్తున్న సంగతి తెలిసిందే. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు చూసి వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. అలాగే ఏదైనా టీజర్, ట్రైలర్ నచ్చినా ప్రశంసిస్తూ లింక్ షేర్ చేస్తున్నాడు. తాజాగా అతను ‘పేపర్ బాయ్’ ట్రైలర్ గురించి మాట్లాడాడు. ‘పేపర్ బాయ్’ ట్రైలర్ చూశానని.. చాలా ఫ్రెష్‌గా, ప్లెజెంట్‌గా అనిపించిందని మహేష్ చెప్పాడు. సినిమా బాగా ఆడాలని ఆకాంక్షించాడు. మహేష్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడటానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ చిత్ర కథానాయకుడు సంతోష్ శోభన్ తండ్రి శోభన్‌తో మహేష్ పని చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘బాబీ’ సినిమా వచ్చింది. శోభన్‌తో పని చేసిన విషయాన్ని మహేష్ ప్రస్తావించాడు కూడా.

నిజానికి ‘బాబీ’ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయింది. మహేష్ కెరీర్లోనే అతి పెద్ద ఫ్లాపుల్లో అది ఒకటి. శోభన్‌కు అదే తొలి సినిమా. ఆ తర్వాత ‘వర్షం’ లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. తనకు చేదు అనుభవాన్ని మిగిల్చినా.. శోభన్‌పై ప్రేమతో మహేష్ అతడి కొడుకు సినిమా ట్రైలర్‌ను షేర్ చేసి సపోర్టివ్వడం మంచి విషయమే. శోభన్ ‘వర్షం’ తర్వాత తీసిన ‘చంటి’ కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన గుండెపోటుతో మరణించాడు. పెద్ద కెరీర్ ఏమీ లేకపోయినా.. శోభన్‌కు మాత్రం ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. ఆ పేరే శోభన్‌కు పనికొస్తోంది. హీరోగా అతడి తొలి సినిమా ‘తను నేను’కు త్రివిక్రమ్ సపోర్టివ్వడం తెలిసిందే. ‘గోల్కొండ హైస్కూల్’ దగ్గర్నుంచి శోభన్‌కు అవకాశాలు దక్కుతుండటానికి కూడా శోభన్ మంచితనమే ఒక కారణమని చెప్పొచ్చు. ఈ కుర్రాడు కూడా తన టాలెంట్ ఏంటో ప్రతి సినిమాలోనూ చూపిస్తూనే ఉన్నాడు. ‘పేపర్ బాయ్’ అతడికి హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English