మెగా ఫ్యామిలీ ఉద్దేశమేంటి?

మెగా ఫ్యామిలీ ఉద్దేశమేంటి?

టాలీవుడ్లో ఇంతకుముందు పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం దాసరి నారాయణరావు విషయంలోనే జరిగేది. ఇండస్ట్రీ మొత్తం ఆయన దగ్గరికి కదిలి వెళ్లేది. రోజంతా ఆయన శుభాకాంక్షల్లో మునిగి తేలేవాళ్లు. అలాగే ముందు రోజు నుంచే ఇండస్ట్రీలో ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వహించేవారు. ఐతే ఇప్పుడు చిరంజీవి విషయంలో ఇలా జరుగుతుండటం విశేషం. రెండేళ్ల కిందట చిరుకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా షష్టిపూర్తి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఐతే అది స్పెషల్ అకేషన్ కాబట్టి అలా చేశారేమో అనుకున్నారు. కానీ గత ఏడాది దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో జన్మదిన వేడుకలు జరిగాయి. ముందు రోజు మెగా ఫ్యామిలీలోని ప్రముఖులంతా కలిసి ఒక ఆడిటోరియంలో సెలబ్రేషన్స్ చేశారు. దానికి చిరంజీవి మాత్రం హాజరుకాలేదు.

ఈసారి కూడా ఇలాగే మెగా అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చిరు తనయుడు రామ్ చరణ్, మేనల్లుడు అల్లు అర్జున్.. ఇంకా అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక సినిమా వేడుకకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ వేడుకలు జరిగాయి. భారీ స్పీచ్‌లు ఇచ్చారు. ఇదే వేదికపై అల్లు రామలింగయ్య పురస్కారాన్ని కూడా సునీల్‌కు అందజేశారు. మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఏటా ఆనవాయితీగా ఇలా చిరు జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున చేసేలా కనిపిస్తున్నారు. మధ్యలో రాజకీయాల్లోకి రావడం వల్ల దెబ్బ తిన్న ప్రతిష్టను తిరిగి తెప్పించే ప్రయత్నంలోనూ ఇది భాగంగా కనిపిస్తోంది. మధ్యలో ఏం జరిగినా చిరంజీవి లెజెండే అని చాటడానికి... ఒక సినిమా నటుడిగానే ఆయన ఇమేజ్‌ను పెంచడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి బాగానే సహకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు