రాజశేఖర్ కొత్త సినిమా ఇంట్రెస్టింగ్

రాజశేఖర్ కొత్త సినిమా ఇంట్రెస్టింగ్

గత ఏడాది ముందు వరకు కొన్నేళ్ల పాటు తెలుగు సినిమాల్లో రాజశేఖర్ ఉనికే కనిపించలేదసలు. ఇక ఆయన కెరీర్ ముగిసినట్లే అనుకుంటుండగా.. ‘గరుడవేగ’తో మళ్లీ తన ఉనికిని చాటుకున్నారాయన. ఈ సినిమా మొదలైనపుడు కూడా పెద్దగా ఆసక్తి కనిపించలేదు కానీ.. రిలీజ్ ముంగిట కొంచెం బజ్ వచ్చింది. అలాగే సినిమాకూ మంచి టాక్ కూడా రావడంతో జనాలు మళ్లీ రాజశేఖర్ గురించి చర్చించుకున్నారు. ప్రేక్షకులకు ఓ మోస్తరుగా థియేటర్లకు వెళ్లారు. ‘గరుడవేగ’ కమర్షియల్‌గా అనుకున్నంత పెద్ద సక్సెస్ కాకపోయినా.. రాజశేఖర్ కెరీర్‌కైతే ఊపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత వెంటనే ఇంకో ప్రాజెక్టేమీ మొదలుపెట్టకుడా ఆచితూచి వ్యవహరించాడాయన.

‘అ!’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ సినిమా కమిటైనట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ విషయం తాజాగా రూఢి అయింది. ఈ చిత్ర ప్రి లుక్ లాంచ్ అయింది. ఇది సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఒక ఇంగ్లిష్ న్యూస్ పేపర్ కవర్ పేజీ బ్యాక్ డ్రాప్‌లో ఈ ప్రి లుక్ డిజైన్ చేయడం విశేషం. డాక్టర్ రాజశేఖర్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని.. ఈ నెల 26న టైటిల్ లాంచ్ ఉంటుందని అందులో హింట్ ఇచ్చారు. కింద ‘హు ఈజ్ ద మర్డరర్’ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాని కింద కపిల్ దేవ్ ప్రపంచకప్ ఎత్తుకున్న ఫొటో ఉంది. పక్కన్న ‘ఖైదీ’ సినిమా నేడే విడుదల అంటూ ప్రకటన కనిపిస్తోంది. అంటే ఇది 1983లో నడిచే మర్డర్ మిస్టరీ అని అర్థమవుతోంది. హిందీలో వచ్చిన ‘స్పెషల్ చబ్బీస్’.. ‘రుస్తుమ్’ తరహాలో సినిమా ఆసక్తి రేకెత్తించేలా కనిపిస్తోంది. బ్యాక్ డ్రాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ‘అ!’ తర్వాత ప్రశాంత్ వర్మ ‘క్వీన్’ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్-ప్రశాంత్ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English