ప్రభాస్ పెళ్లి.. కొత్త మాట

ప్రభాస్ పెళ్లి.. కొత్త మాట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచి పోతున్నాయి కానీ.. ప్రభాస్ పెళ్లి మాత్రం కావట్లేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా అనిపించడం లేదు. ముందు రెండేళ్ల పాటు ‘బాహుబలి’ చిత్రీకరణ అయ్యాక పెళ్లి అన్నారు. కానీ ఆ చిత్రం పూర్తవడానికి ఐదేళ్లు పట్టింది.

తర్వాతైనా పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంటే ‘సాహో’లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ప్రభాస్ సంగతేమో కానీ.. అతడి పెదనాన్న కృష్ణం రాజు ఎప్పుడు మీడియాను కలిసినా ఆయనకు ఈ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. ఐతే అందరికీ తెలిసిన విషయమే ఆయనా చెప్పారు.

ఇంతకుముందు ‘బాహుబలి’ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటా అని ప్రభాస్ అనేవాడని.. కానీ ఇప్పుడు ‘సాహో’లో బిజీ అయిపోయాడని.. అదయ్యాక చూద్దాం అంటున్నాడని కృష్ణం రాజు చెప్పాడు. ఐతే ఈ సినిమా పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ పెళ్లి చేసేయాలని కృష్ణం రాజు కుటుంబం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధాలు కొంచెం గట్టిగానే చూస్తున్నారని.. అమ్మాయి ఖరారైందని కూడా వార్తలొస్తున్నాయి.

ఇక ప్రభాస్ విషయానికొస్తే అతను మీడియాకు దొరకడం తక్కువ. దొరికినపుడు మాత్రం పెళ్లి ప్రశ్న తప్పట్లేదు. చివరగా ‘సాహో’కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందులోనూ వివాహం గురించి అడిగారు. ఐతే పెళ్లి అనేది తన వ్యక్తిగత వ్యవహారం అని.. దాని గురించి ఇతరులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఐతే తాను పెళ్లి చేసుకోబోతుంటే మాత్రం అందరికీ ఆ విషయాన్ని చెబుతానని ప్రభాస్ స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు