'సైరా' బడ్జెట్ అంతా?

'సైరా' బడ్జెట్ అంతా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఐతే చిరు కెరీర్లో ఇది అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా అని తెలుసు కానీ.. ఆ బడ్జెట్ ఎంత అన్నది మాత్రం క్లారిటీ లేదు. మంగళవారం టీజర్ లాంచ్ సందర్భంగా మీడియా వాళ్లు ఇదే విషయం అడిగితే.. ఎంత అన్న లెక్క చెప్పలేదు చరణ్. చాలా ఎక్కువ ఖర్చుతో సినిమా నిర్మిస్తున్నామని.. ఇంత అని లెక్కలు వేసుకోకుండా ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమై సినిమా చేస్తున్నామని అన్నాడు. ఐతే ఇదే రోజు రాత్రి జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ‘సైరా’ బడ్జెట్ లెక్క ఎంతో చెప్పేశాడు. అతను కూడా కరెక్ట్ నంబర్ చెప్పలేదు కానీ.. ఒక అంచనా అయితే కలిగేలా చేశాడు.

చిరు గత సినిమా 'ఖైదీ నంబర్ 150'కి ఎంత వసూళ్లు వచ్చాయో దానికి రెట్టింపు ఖర్చు పెడుతున్నట్లుగా బన్నీ చెప్పాడు. ఐతే ఇక్కడ అతనన్నది షేరా.. గ్రాసా అన్నది తెలియదు మరి. షేర్ అయితే రూ.105 కోట్లు వచ్చింది. అది అప్పటికి నాన్-బాహుబలి రికార్డు కూడా. దీనికి రెట్టింపు అంటే రూ.210 కోట్లు అనుకోవాలి. ఒకవేళ బన్నీ గ్రాస్ లెక్కల్లో చెప్పి ఉంటే మాత్రం బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటే అనుకోవాలి. అదే నిజమైతే మాత్రం దీన్ని ‘బాహుబలి’ రేంజ్ సినిమా అనే అనుకోవాలి. చిరు బాక్సాఫీస్ స్టామినాను తక్కువ అంచనా వేయడం కాదు కానీ.. ఆ స్థాయిలో ఖర్చు పెట్టి ఉంటే మాత్రం రికవరీ అంత ఈజీ కాదు. ‘సైరా’ను తెలుగుతో పాటు తమిళం.. హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ‘బాహుబలి’ చూసిన కళ్లతో దీన్ని చూసి మెచ్చాలంటే ఔట్ పుట్ ఓ రేంజిలో ఉండాలి. జక్కన్నలా సురేందర్ రెడ్డి ఒక మ్యాజిక్ చేయాలి. మరి అతనలా చేయగలడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English