బన్నీ కారవాన్లో సునీల్ భోజనం

బన్నీ కారవాన్లో సునీల్ భోజనం

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా పద్మశ్రీ అల్లు రామలింగయ్య అవార్డును కమెడియన్, హీరో సునీల్‌కు అందజేశారు. అతడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సునీల్ అల్లు వారి కుటుంబంతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అల్లు రామలింగయ్య పురస్కారం తనకు దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పిన సునీల్.. తనకు  ఆయనతో ఒక చిన్న అనుభవం ఉందన్నాడు.

తనకు అనుకోకుండా ఒక సినిమాలో అల్లు రామలింగయ్యతో పని చేసే అవకాశం లభించిందని.. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి తన పేరు సునీల్ అని పరిచయం చేసుకున్నానన్నాడు. ఐతే ఆయన తెలుసురా అబ్బాయ్ అని ప్రేమగా మాట్లాడారని.. కామెడీ బాగా చేస్తావని మెచ్చుకున్నారని చెప్పాడు.

ఆ సందర్భంగా తాను అల్లు రామలింగయ్యను ఎలా అనుకరిస్తూ డైలాగ్ చెప్పేముందు అరుస్తానో వివరించి చెప్పానని.. దానికి ఆయన తనకు అలా అరవడం ఎలా అలవాటైందో చెప్పారని సునీల్ వెల్లడించాడు. చిన్నపుడు స్కూల్లో మాస్టారు కొట్టడానికి ముందే పిల్లాడు అరుస్తాడని.. ఆ తరహాలో తాను కూడా అరిచేవాడినని.. ఆ రకంగా చూస్తే తాను కూడా చిన్నపిల్లాడినే అని చెప్పారని సునీల్ అన్నాడు.

ఇక అల్లు అర్జున్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. తనను అతనెప్పుడూ ఒక ఆర్టిస్టులా చూడలేదని.. కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడని అన్నాడు. తన కారవాన్లోనే కూర్చోబెట్టుకుని తనకోసం తెప్పించిన భోజనం పెట్టి ప్రేమను పంచేవాడని సునీల్ చెప్పాడు. అల్లు వారి కుటుంబంలో అందరూ మంచి వాళ్లే అని.. వాళ్లందరూ బాగుండాలని సునీల్ ఆకాంక్షించాడు. ఇక చిరంజీవి అభిమానుల్లో ఒకడినైన తాను ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా సత్కారం అందుకోవడం గొప్ప గౌరవమని సునీల్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు