హీరోని వెలి వేసిన ఆడియన్స్‌

హీరోని వెలి వేసిన ఆడియన్స్‌

పేరున్న నటుడ్ని ప్రేక్షకులు వెలి వేయడం ఎక్కడైనా కన్నామా, విన్నామా? ఓ హీరోయిన్‌ రేప్‌ కేస్‌లో నిందితుడు అయిన మలయాళ నటుడు దిలీప్‌ సినిమా అతను జైల్లో వుండగా రిలీజ్‌ అయితే దానికి బ్రహ్మాండమైన ప్రజాదరణ దక్కింది. ఇది మన ప్రేక్షకులకి ఒక హీరోపై వుండే అభిమానం అని చెప్పుకోవాలి. కానీ హాలీవుడ్‌లో ఒక్కసారి పేరు బదనాం అయిందంటే ఇక అంతే సంగతులు.

కెవిన్‌ స్పేసీ అనే ఒకప్పటి సూపర్‌స్టార్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చాలానే వచ్చాయి. దీంతో అతడిని చాలా మంది తమ సినిమాలు, సీరియళ్ల నుండి తొలగించారు. కొన్ని పూర్తయిన చిత్రాల్లో కూడా అతను చేసిన సీన్లు తీసేసి వేరే నటులతో రీషూట్‌ చేసారు. తాజాగా అతను నటించిన ఒక చిత్రం రిలీజ్‌ అయితే ప్రేక్షకులు దానిని నిర్దయగా నిషేధించేసారు. 'బిలియనీర్‌ బాయ్స్‌ క్లబ్‌' అనే చిత్రానికి వారం రోజుల్లో కేవలం 618 డాలర్లు మాత్రం వసూలయ్యాయి. అందుబాటులో వున్న థియేటర్లన్నిటిలోను విడుదల చేసినా కానీ దీనికి వచ్చిన వసూళ్లు ఇంతేనట.

సగటున రోజుకి కేవలం ఆరుగురు మాత్రమే ఈ చిత్రాన్ని చూసారని, పదకొండు థియేటర్లకి ఆరుగురు ప్రేక్షకులంటే, కొన్ని థియేటర్లలో అసలు మనిషే లేడని అర్థమవుతోంది. ఇంత నిర్దాక్షిణ్యంగా రెండుసార్లు ఆస్కార్‌ అందుకున్న సీనియర్‌ నటుడ్ని నిషేధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లైంగిక వేధింపుల కేసుని అమెరికన్లు ఎంత సీరియస్‌గా తీసుకుంటారనేది దీనిని బట్టి తెలుస్తోంది. హీరో వర్షిప్‌ తారాస్థాయిలో వుండే మన దేశంలో ఇలాంటివి కనీసం ఊహకైనా సాధ్యమా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు