బన్నీ హ్యాండివ్వలేదన్నమాట..

బన్నీ హ్యాండివ్వలేదన్నమాట..

ఒక సంస్థలో కానీ లేదా ఒక హీరోతో కలిసి కానీ ఒక దర్శకుడు సినిమా చేస్తున్నాడా లేదా అన్నది ఆ సంస్థో.. ఆ హీరోనో అంతకుముందు చేస్తున్న సినిమాలకు సంబంధించిన వేడుకలే నిర్ధారించేస్తుంటాయి. తమ తర్వాతి సినిమాకు పని చేయబోయే దర్శకుల్ని ముందు జరిగే వేడుకలకు ఆహ్వానిస్తుంటారు నిర్మాతలు.. హీరోలు. ఇలా గతంలో చాలా కాంబినేషన్లపై జనాలకు ముందే ఒక అవగాహన వచ్చింది.

ఇప్పుడు అల్లు అర్జున్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ కూడా ఇలాగే ఖరారైంది. గీతా ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ కు విక్రమ్ కుమార్ అతిథిగా వచ్చి వేదికెక్కి ప్రసంగించడంతో అతను ఈ బేనర్లో సినిమా చేయబోతున్నాడని కన్ఫమ్ అయింది. మామూలుగా విక్రమ్ తన సినిమాల వేడుకలకు తప్ప వేరే ఫంక్షన్లకు వెళ్లడు. అలాంటివాడు ఈ వేడుకకు వచ్చాడంటే ఇక వేరే అర్థం ఏముంటుంది?

నిజానికి బన్నీ-విక్రమ్ సినిమా ఈపాటికే మొదలు కావాల్సింది. ‘నా పేరు సూర్య’ చేస్తుండగా గత ఏడాదే వీళ్ల మధ్య కథా చర్చలు మొదలయ్యాయి. ‘నా పేరు సూర్య’ విడుదల సమయానికే సినిమా ఓకే అయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో బన్నీ పునరాలోచనలో పడ్డాడు. విక్రమ్ స్టయిల్లో సీరియస్ గా సినిమా సాగితే కష్టమని.. తన మార్కు ఎంటర్టైన్మెంట్ ఉండాలని భావించి స్క్రిప్టు మార్చాలని చెప్పడంతో సినిమా ఒక కొలిక్కి రాలేదు. ఒక దశలో బన్నీతో విక్రమ్ సినిమా దాదాపు ఆగిపోయిందని.. బన్నీ వేరే ఆప్షన్ల వైపు చూస్తున్నాడని ప్రచారం జరిగింది.

కానీ విక్రమ్‌కు అతను హ్యాండివ్వలేదని తాజా పరిణామంతో రుజువైంది. విక్రమ్ ఇంకా గీతా ఆర్ట్స్ కాంపౌండ్లోనే ఉన్నాడని తేలింది. బన్నీని మెప్పించడం కోసం విక్రమ్ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాడు. ఇంకా స్క్రిప్టుకు ఆమోద ముద్ర పడలేదని తెలుస్తోంది. కమిట్మెంట్ వదలరు.. కానీ స్క్రిప్టు పక్కాగా రెడీ కాకుండా సినిమానూ మొదలుపెట్టరు. బన్నీ కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడంతో అల్లు అరవింద్ సైతం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.