మణిరత్నం కొత్త భామను తెచ్చాడు..

మణిరత్నం కొత్త భామను తెచ్చాడు..

హీరోయిన్ల పాత్రల్ని డిజైన్ చేయడంలో, వారిని తెరపై చూపించడంలో కొందరు దర్శకులది ప్రత్యేకమైన శైలి. అందులో దక్షిణాదిన ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన కెరీర్లో తొలి పెద్ద హిట్ ‘మౌన రాగం’ నుంచి చివరగా చేసిన ‘చెలియా’ వరకు ప్రతి సినిమాలోనూ కథానాయికల పాత్రల్ని చాలా బాగా డిజైన్ చేశాడు.. మరే దర్శకుడూ చూపించనంత బాగా హీరోయిన్లను చూపించాడు మణి. అందుకే మణితో ఒక్కసారైనా పని చేయాలని హీరోయిన్లందరూ కోరుకుంటారు. ఆయనతో పని చేసే అవకాశం దక్కితే దాన్ని అదృష్టంగా భావిస్తారు.
‘చెలియా’తో చాలా మంచి పేరు తెచ్చుకున్న అదితి రావు హైదరి.. మణిరత్నం కొత్త సినిమా ‘చెక్క చివంత వానమ్’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇంకో ముగ్గురు కథానాయికలకూ చోటుంది.

అందులో ఇద్దరు జ్యోతిక.. ఐశ్వర్యా రాజేష్ కాగా.. చివరమ్మాయి డయానా ఎరప్ప. మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయికి తొలి సినిమానే మణిరత్నంతో చేసే అవకాశం దక్కింది. అసలు తనను ఇలాంటి సినిమాకు ఎంపిక చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని అంటోంది డయానా. తాను మరీ పొడవుగా ఉంటానని.. అంత రంగు కూడా ఉండనని.. తాను సినిమాలకు పనికి రానని అనుకునే దాన్నని.. కానీ మణిరత్నం ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాల్ వచ్చిందని.. అది ప్రాంక్ కాల్ అనుకున్నానని.. కానీ తర్వాత నిజంగానే తనను మణి సినిమా కోసం అడిగారని తెలిసిందని.. ముంబయిలో ఆడిషన్ తర్వాత తనను సినిమాకు సెలక్ట్ చేయడం షాకయ్యానని డయానా చెప్పింది.

తెలుగుతో ‘నవాబ్’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంలో డయానా.. ఛాయా అనే పాత్రలో నటిస్తోంది. ఆమె శింబుకు జోడీగా కనిపించనుంది. అరవింద్ స్వామి.. విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు