అన్నీ ‘ఆర్ఎక్స్ 100’లా ఆడేస్తాయా?

అన్నీ ‘ఆర్ఎక్స్ 100’లా ఆడేస్తాయా?

ఒక సినిమాలో శృంగార సన్నివేశాల డోస్ ఎక్కువగా ఉండి ఆ సినిమా బాగా ఆడేస్తే.. ఇక ఆ తరహాలో సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. కానీ మొబైల్లో పోర్న్ సినిమాలే నేరుగా చూసే వీలున్న ఈ రోజుల్లో కేవలం ఎక్స్‌పోజింగ్, ఇంటిమేటింగ్ సీన్లతో సినిమాలు ఆడేస్తాయనుకుంటే భ్రమే.

ఆ రోజులు ఎప్పుడో పోయాయి. గత నెలలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్ బస్టర్ అయిందంటే కేవలం అందులోని ఇంటిమేట్ సీన్లే కారణం అనుకుంటే అంత కంటే వెర్రితనం మరొకటి ఉండదు. కాకపోతే ఆ సీన్లు కుర్రాళ్లలో సినిమాపై ఆసక్తి రేపిన మాట వాస్తవం. సినిమాలో మిగతా కంటెంట్ కూడా నచ్చడంతో సినిమా ఆడింది. అలాగని అన్ని సినిమాలకూ ఇలాంటి మ్యాజిక్ జరిగిపోతుందనుకుంటే పొరబాటే.

ఈ మధ్యనే ‘24 కిసెస్’ అనే సినిమా టీజర్ లాంచ్ అయింది. టీజర్ నిండా ముద్దులే ముద్దులు. మరి ఆ చిత్రం ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందో చూడాలి. ఇప్పుడు తాజాగా ‘రథం’ అనే కొత్త సినిమా పోస్టర్ వదిలారు. అందులో హీరోయిన్ని విచిత్రమైన భంగిమలో ముద్దాడుతున్నాడు హీరో. అది కొంచెం అతిగానే అనిపిస్తోంది. ఇందులో ‘ఆర్ఎక్స్ 100’ అనుకరణ కనిపిస్తోంది.

ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఇదో ఎత్తుగడలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ లాంటి ప్రముఖులు వచ్చి ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. గీత్ ఆనంద్, చాందిని జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ కానూరి డైరెక్ట్ చేశాడు. మరి ‘ఆర్ఎక్స్ 100’ టైపులో ఈ చిత్ర బృందం వేస్తున్న ఎత్తుగడలు ఏమాత్రం ఫలితాస్తాయో.. ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు