నాగచైతన్య మామూలుగా ఇరుక్కోలేదు

నాగచైతన్య మామూలుగా ఇరుక్కోలేదు

అనుకున్నదే అయింది. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా వాయిదా పడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర కథానాయకుడు అక్కినేని నాగచైతన్యనే వెల్లడించాడు. అందరూ అనుకున్నట్లు కేరళలో వర్షాలు, వరదల వల్లే ఈ చిత్ర విడుదలకు ఆటంకం కలిగినట్లు వెల్లడైంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీసుందర్ కేరళవాడన్న సంగతి తెలిసిందే. అతనక్కడ రీరికార్డింగ్ పనులు పూర్తి చేయలేని పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. పెండింగ్ వర్క్ పూర్తి చేయాలని ఎంతో ప్రయత్నించారు కానీ.. కుదర్లేదు.

చివరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది చిత్ర బృందానికి మామూలు ఇబ్బంది కాదు. ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఎంచుకున్న డేట్ ఇది. నెల కిందటే విడుదల తేదీ ఖరారు చేసుకున్నారు. ఇది కొంచెం పెద్ద స్థాయి సినిమానే కావడంతో దీన్ని బట్టి ముందు, వెనుక వారాల్లో సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.

చైతూ సినిమా తర్వాత రెండేసి వారాల గ్యాప్‌లో సమంత, నాగార్జునల సినిమాలు రాబోతున్నాయి. సెప్టెంబరు 13న ‘యు టర్న్’ విడుదల కానుండగా.. 27న ‘దేవదాస్’ రాబోతోంది. ఐతే ఇప్పుడు చైతూ సినిమా వాయిదా పడటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబరు 7కు వాయిదా వేద్దామంటే ఆ రోజుకు ఒకటికి నాలుగు చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.

ఇది ఆ వారానికి వాయిదా పడితే.. వాటన్నింటికీ ఇబ్బందే. అసలు అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అన్నది డౌటు. ఈ డేటు కాదంటే ఇక సెప్టెంబరు 20కి వెళ్లాలి. కానీ ముందు వారం సమంత సినిమా, తర్వాతి వారం నాగార్జున సినిమా పెట్టుకుని దీన్ని మధ్యలో రిలీజ్ చేస్తారా అన్నది సందేహం. అలా వద్దనుకుంటే ఇక అక్టోబరుకు వెళ్లాలి.

ఆ నెలలో ఆల్రెడీ ప్రతి వారానికీ పెద్ద సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘శైలజారెడ్డి’ అల్లుడు టీంకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు