ఆర్ఎక్స్ 100 బైకు వేలానికి..

ఆర్ఎక్స్ 100 బైకు వేలానికి..

ఆర్ఎక్స్ 100.. చాలా చిత్రంగా అనిపించిన టైటిల్ ఇది. బైకు పేరును సినిమాకు టైటిల్‌గా వాడుకోవడం చిత్రమైన విషయం. ఐతే ఈ టైటిల్ జనాల్ని ఆకర్షించడంలో బాగానే ఉపయోగపడింది. నిజానికి సినిమాకు ఈ టైటిల్‌కు పెద్దగా సంబంధం ఏమీ ఉండదు. హీరో ఆ బైకు వేసుకుని తిరుగుతుంటాడంతే. ఐతే యమహా ఆర్ఎక్స్ 100తో ఒకప్పుడు కుర్రకారు ఎంతటి అనుబంధం ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఇప్పుడు కూడా ఆ బైక్ అంటే కుర్రాళ్లకు క్రేజే. దాని సౌండే వేరుగా ఉంటుంది. ఆ రకంగా సినిమాలో ఈ బైక్‌ను చూసి చాలామంది నోస్టాల్జిక్‌గా ఫీలైన వాళ్లే. విశేషం ఏంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’లో హీరో వాడిన బైకు ఇప్పుడు వేలానికి రాబోతోంది. ఇది ఒక మంచి పని కోసం ఉద్దేశించిన వేలం.

కేరళలో వరదలతో అల్లాడుతున్న జనాల కోసం సాయం అందించడానికి ఈ బైకును వేలం వేస్తున్నట్లు హీరో కార్తికేయ ప్రకటించాడు. నిజానికి తాను సినిమాలో వాడిన బైక్ అంటే చాలా చాలా ఇష్టమని.. దాన్ని జీవితాంతం తన దగ్గరే పెట్టుకోవాలని అనుకున్నానని.. కానీ కేరళ జనాలు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఆ బైకుపై తన ప్రేమ చాలా చిన్నదనిపించిందని.. అందుకే దీన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నానని అతను వెల్లడించాడు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా విషయంలో ఎలాగైతే సపోర్ట్ చేశారో.. ఈ మంచి పని కోసం కూడా అలాగే సహకారం అందించాలని అతను కోరాడు. రూ.50 వేల కనీస ధరతో బిడ్డింగ్ మొదలవుతుందని అతను చెప్పాడు. మరి ఈ వేలం ఎక్కడిదాకా వెళ్తుందో.. దీని ద్వారా ఎంత మొత్తం వసూలవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు