కూతురితో సురేష్ బాబు సినిమా

కూతురితో సురేష్ బాబు సినిమా

ఇక్కడ మాట్లాడుతున్నది సొంత కూతురి గురించి కాదు. వరుసకు కూతురయ్యే అమ్మాయి గురించి. ఆమె మరెవరో కాదు.. సురేష్ మేనల్లుడు అక్కినేని నాగచైతన్య భార్య అయిన సమంత. పెళ్లయ్యాక వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్న సామ్.. త్వరలోనే తన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యు టర్న్’తో ప్రేక్షకలు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది విడుదల కాకముందే సమంత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అయినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని మరో సంస్థతో కలిసి ‘సురేష్ ప్రొడక్షన్స్’ బేనర్ మీద సురేష్ నిర్మిస్తారని సమాచారం.

ఇది కొరియన్ క్లాసిక్ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అని అంటున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసుకుని సినిమా తీయనున్నారట. ఇంతకుముందు సమంతతో  ‘జబర్దస్త్’ సినిమా తీసిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుందని సమాచారం. మొత్తానికి ఈ కాంబినేషన్ అయితే చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఒక మహిళ జీవితంలోని వివిధ దశల్ని చూపిస్తారు. ఆ క్రమంలో హీరోయిన్ 70 ఏళ్ల ముసలావిడగానూ కనిపించాల్సి ఉంటుంది. మరి సమంతను అలా చూడ్డానికి అభిమానులు ఒప్పుకుంటారా అన్నది కూడా చూడాలి. నిజానికి నందిని రెడ్డి విజయ్ దేవరకొండతో సినిమా తీయాల్సింది. కానీ అతను అందుబాటులోకి రాలేదు. అతడి కోసం అనుకున్న కథ కూడా ఓకే అవ్వలేదు. ‘కళ్యాణ వైభోగమే’ తర్వాత రెండేళ్లకు పైగా ఖాళీగా ఉండిపోయిన నందిని.. ఇక ‘మిస్ గ్రానీ’ రీమేక్‌కు రెడీ అయిపోయినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు