‘సైరా’ టీజర్.. టైం కూడా ఫిక్సయింది

‘సైరా’ టీజర్.. టైం కూడా ఫిక్సయింది

ఇంకొక్క రోజే మిగిలింది తెలుగులో ‘బాహుబలి’ తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా.. అంత భారీగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ విడుదలకు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కాగా.. ముందు రోజే అభిమానులకు కానుకగా ఈ టీజర్ లాంచ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఐతే డేట్ ఇచ్చారు కానీ.. ఏ సమయానికి టీజర్ వస్తుందో ప్రకటించలేదు. తాజాగా ఆ విషయంలోనూ నిర్మాణ సంస్థ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ‘సైరా’ టీజర్ రిలీజవుతుంది. ఈ టీజర్ కోసం మెగా అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

దశాబ్దం కిందట్నుంచో చర్చల్లో ఉన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరు రాజకీయాల్లోకి వెళ్లకముందే పరుచూరి సోదరులు ఆయనకు ఈ కథ చెప్పారు. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినపుడు కూడా ముందు ఈ చిత్రమే చేయాలని కూడా చూశాడు చిరు. కానీ రీఎంట్రీలో తొలి సినిమాతోనే ఇలాంటి రిస్కీ ప్రాజెక్టు వద్దనుకుని వెనక్కి తగ్గాడు. ‘ఖైదీ నంబర్ 150’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో తన 151వ చిత్రంగా ‘సైరా’ను మొదలుపెట్టాడు. గత ఏడాదే చిత్రీకరణ మొదలుపెట్టగా.. ఇన్ని రోజుల్లో పూర్తయింది సగం సినిమానే అంటున్నారు. ఐతే సినిమాలో అతి కష్టమైన, భారీతనంతో కూడుకున్న సన్నివేశాలన్నీ పూర్తయ్యాయట. ఇక మిగతా సన్నివేశాల్ని వేగంగా షూట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్రణాళికలో చిత్ర బృందం ఉంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు