బిల్డింగ్ కట్టాకే ఎన్నికలంటున్న విశాల్

బిల్డింగ్ కట్టాకే ఎన్నికలంటున్న విశాల్

రెండేళ్ల కిందట తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. శరత్ కుమార్ నేతృత్వంలో పెద్ద స్థాయి వ్యక్తులతో కూడిన ప్యానెల్‌ను సవాల్ చేసిన విశాల్ అండ్ టీం ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడం సంచలనం రేపింది. ఎన్నికల్లో ఈ టీం నుంచి నాజర్ అధ్యక్షుడైతే.. విశాల్ కార్యదర్శి అయ్యాడు. కార్తి కోశాధికారి బాధ్యత తీసుకున్నాడు. గత రెండేళ్లలో నడిగర్ సంఘం తరఫున ఈ ప్యానెల్ మంచి పనులు చాలానే చేసింది. సంఘం కోసం ఒక భారీ భవనం కూడా కడుతోంది. ఐతే ఈ కమిటీ రెండేళ్ల పదవీ కాలం పూర్తయి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐతే నిర్ణీత సమయానికి ఎన్నికలు నిర్వహించమని.. ఆరు నెలలు వాయిదా వేస్తామని విశాల్ కమిటీ ప్రకటించడం గమనార్హం. తాజాగా చెన్నైలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వాయిదాకు కారణమేంటో విశాల్ వివరించాడు.

సంఘానికి సంబంధించి టీనగర్‌లోని ప్రాంతంలో భారీ భవనాన్ని నిర్మిస్తున్నామని.. ఇదొక ఐకానిక్ బిల్డింగ్ వుతుందని చెప్పాడు. ఈ భవనం చూస్తే ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారన్నాడు. భవన నిర్మాణానికి ఇంకా రూ.20 కోట్లు అవసరమని.. అందుకోసం మరిన్ని కార్యక్రమాలు చేయనున్నామని తెలిపాడు. దీని కోసమే ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. అలాగే నడిగర్ సంఘం పూర్తి పేరు ‘దక్షిణ భారత నటీనటుల సంఘం’ను మార్చబోతున్నారని వస్తున్న వార్తల్ని అతను ఖండించాడు. సంఘం అధ్యక్షుడు నాజర్‌ మాట్లాడుతూ దేశంలో ముఖ్యమైన నగరంగా చెన్నైకి గుర్తింపు ఉందని.. కానీ ఇక్కడ ఎలాంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగడం లేదన్నాడు. దిల్లీ, ముంబయి, గోవా వంటి ప్రాంతాల్లోనే ఇలాంటి వేడుకలు జరుగుతున్నాయని.. తాము కడుతున్న భవనం పూర్తయిన తర్వాత పలు అంతర్జాతీయ కార్యక్రమాలు తప్పకుండా చెన్నైలో జరుగుతాయని ధీమా వ్యక్తం చేశఆడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు