నేచురల్ స్టార్‌ను కింద పడేశాడుగా..

నేచురల్ స్టార్‌ను కింద పడేశాడుగా..

అప్పుడప్పుడూ చిన్న, మీడియం రేంజి సినిమాలు అంచనాల్ని మించి ఆడేయడం.. అనూహ్య వసూళ్లు సాధించడం చూస్తుంటాం. పెద్దగా ఇమేజ్ లేని హీరోల సినిమాలు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఆడేయడమూ అనుభవమే. మూడేళ్ల కిందట వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. నాని అంతకుముందు చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఐదారు కోట్ల మధ్య షేర్ రాబట్టిందంతే. ఒకవేళ ‘భలే భలే..’ హిట్ టాక్ తెచ్చుకున్నా.. మహా అయితే 20 కోట్ల షేర్ వస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ ఆ చిత్రం అనూహ్యంగా రూ.35 కోట్ల దాకా షేర్.. 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అప్పుడు అందరూ నానిని స్టార్ అని గుర్తించారు. ఈ సినిమా టైటిల్స్‌లో తమాషాగా వేసిన ‘నేచురల్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ ఆ తర్వాత నిజంగానే నానికి తగిలించేశారు. ఆపై ‘నేను లోకల్’.. ‘ఎంసీఏ’ సినిమాలతోనూ దాదాపుగా ఇదే స్థాయిలో వసూళ్లు రాబట్టి తన బాక్సాఫీస్ స్టామినాను రుజువు చేసుకున్నాడు నాని.

ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండ జోరు నానికి మించి సాగుతోంది. అతడి సినిమా ‘గీత గోవిందం’ వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఈ సినిమాకు విడుదలకు ముందు వచ్చిన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఇది భారీగానే వసూళ్లు రాబడుతుందని అనుకున్నారు. కానీ విడుదల తర్వాత ఆ అంచనాల్ని కూడా మించిపోయింది. కేవలం ఐదు రోజుల తొలి వీకెండ్లోనే రూ.31.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. సగటున తొలి వారాంతంలో రోజుకు ఆరు కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు. అమెరికాలో ఈ చిత్రం ఆల్రెడీ 1.5 మిలియన్ మార్కును దాటేసింది. దీనికి అక్కడ వచ్చిన ఓపెనింగ్స్‌ను బట్టి వీకెండ్ అయ్యేసరికి 1.3 మిలియన్ల దగ్గర ఉంటుందనుకున్నారు. కానీ శనివారం నాడు ప్రిమియర్ల స్థాయిలో 4 లక్షల డాలర్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. పెద్ద పెద్ద స్టార్లకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. ఇంతకు నాని సాగించిన బాక్సాఫీస్ ప్రభంజనం కూడా విజయ్ సాధిస్తున్న దాంతో పోలిస్తే దిగదుడుపే. మరి నానిని నేచురల్ స్టార్ అన్న జనాలు.. ఇప్పుడీ హీరోను ఏం స్టార్ అంటారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు