బాలీవుడ్ సినిమాలకు ‘గీత గోవిందం’ షాక్

బాలీవుడ్ సినిమాలకు ‘గీత గోవిందం’ షాక్

‘గీత గోవిందం’ ధాటికి ముందు వారాల్లో విడుదలైన తెలుగు సినిమాలన్నీ విలవిలలాడిపోయాయి. అప్పటికే అంతంగామత్రంగా ఆడుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ అడ్రస్ లేకుండా పోగా.. బాగా ఆడుతున్న ‘గూఢచారి’ సైతం ఈ జోరును తట్టుకోలేకపోయింది. ఐతే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. హిందీ చిత్రాలకు సైతం ‘గీత గోవిందం’ షాకివ్వడం విశేషం. బాలీవుడ్ సినిమాలకు మంచి పట్టున్న ఓవర్సీస్ మార్కెట్లో ‘గీత గోవిందం’ జోరు మామూలుగా లేదు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా హిందీలో ‘గోల్డ్’.. ‘సత్యమేవ జయతే’ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకూ మంచి టాకే వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం వీటిపై ‘గీత గోవిందం’ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది.

అమెరికాలో వీకెండ్ అయ్యేసరికే 'గీత గోవిందం' 1.5 మిలియన్ మార్కును అందుకుంటే.. ‘గోల్డ్’.. ‘సత్యమేవ జయతే’ చిత్రాల వసూళ్లు దీని కంటే తక్కువ ఉన్నాయి. ఇక హిందీ సినిమాలకు తిరుగులేని మార్కెట్ ఉన్న ఆస్ట్రేలియాలో పరిస్థితి చూస్తే షాకవ్వాల్సిందే. గీత గోవిందం అక్కడ 2 లక్షల డాలర్లు వసూలు చేస్తే.. ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’ రెండింటి వసూళ్లు కూడా 1.9 లక్షల డాలర్లే ఉన్నాయని.. ఇది పెద్ద షాకే అని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించడం విశేషం. పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండి, మంచి టాక్ కూడా తెచ్చుకున్న సినిమాలపై ‘గీత గోవిందం’ ఈ స్థాయిలో ఆధిపత్యం చలాయించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆదివారం నాటికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.31 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. బయ్యర్లు పెట్టుబడి మీద ఇప్పటికే రెట్టింపు ఆదాయం అందుకున్నట్లు అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు