ఆల్ టైం గ్రేట్ లిస్టులో ‘గూఢచారి’

ఆల్ టైం గ్రేట్ లిస్టులో ‘గూఢచారి’

రెండు వారాల కిందట విడుదలైన ‘గూఢచారి’ సినిమా టాలీవుడ్ బెస్ట్ స్పై థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఆ మాటకొస్తే ఇండియాలో వచ్చిన బెస్ట్ స్పై థ్రిల్లర్లలో కూడా ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రానికి సమీక్షకులందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. బుక్ మై షోలో ఈ చిత్రానికి దాదాపు 90 శాతం పాజిటివ్ రేటింగ్స్ రావడం విశేషం. అలాగే ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత మూవీ డేటా బేస్ సంస్థ ‘ఐఎండీబీ’ కూడా ‘గూఢచారి’కి తగిన గౌరవాన్నే ఇచ్చింది. విడుదలైన మొదట్లో ఈ చిత్రానికి 10కి 9 రేటింగ్ వచ్చింది. ఇక ఓవరాల్ తెలుగు సినిమాల రేటింగ్స్ విషయానికి వస్తే.. అందులోనూ ‘గూఢచారి’కి ప్రత్యేక స్థానం దక్కింది.

ఐఎండీబీలో తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన టాప్-100 సినిమాల రేటింగ్స్ ప్రకారం చూస్తే ‘గూఢచారి’ స్థానం 38 కావడం విశేషం. దానికి అక్కడ రేటింగ్ 7.7గా ఉంది. ఈ జాబితాలో గొప్ప గొప్ప సినిమాలే ఉన్నాయి. ఇందులో అగ్రస్థానం ఆల్ టైం క్లాసిక్ ‘మాయాబజార్’దే. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సాగర సంగమం, అహనా పెళ్లంట, నువ్వు నాకు నచ్చావ్, మహానటి, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, బాహుబలి: ది కంక్లూజన్, అతడు, ఆ నలుగురు ఉన్నాయి. అడివి శేష్ నుంచి ఇంతకుముందు వచ్చిన ‘క్షణం’ ఈ జాబితాలో 14వ స్థానంలో ఉండటం విశేషం. దాని రేటింగ్ 7.9గా ఉంది. శేష్ లాంటి అప్ కమింగ్ హీరో సినిమాలు రెండు టాప్-50లో ఉండటం విశేషమే. ‘గీత గోవిందం’ రాకతో ‘గూఢచారి’ జోరు తగ్గింది కానీ.. ఇప్పటికీ ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. దీని బయ్యర్లందరూ లాభాల్లో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు