అల్లుడి గారి ఆడియో.. ప్చ్!

అల్లుడి గారి ఆడియో.. ప్చ్!

టాలీవుడ్లో అడుగుపెట్టిన కొత్తలో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ‘మజ్ను’.. ‘భలే భలే మగాడివోయ్’.. ‘ఊపిరి’ లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేశాడు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే ఒక సినిమాకు గొప్ప ఔట్ పుట్ ఇచ్చి.. ఇంకో సినిమాతో నిరాశ పరుస్తుంటాడని.. అతడిలో నిలకడ ఉండదని విమర్శలున్నాయి.

గత ఏడాది ‘నిన్ను కోరి’ పాటలతో మెస్మరైజ్ చేసిన గోపీ.. ఈ ఏడాది ‘రాజు గాడు’.. ‘జంబలకిడి పంబ’.. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాలతో తీవ్రంగా నిరాశ పరిచాడు. అతడిలో విషయం అయిపోయిందని అందరూ విమర్శిస్తున్న సమయంలో మళ్లీ ‘గీత గోవిందం’తో తనేంటో చాటిచెప్పాడు. అందులోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మిగతా పాటలు సైతం ఆకట్టుకున్నాయి. దీంతో గోపీ మళ్లీ ఫామ్ అందుకున్నాడనే అనుకున్నారు.

కానీ అక్కినేని నాగచైతన్య-మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విషయంలో మళ్లీ గోపీ నిరాశకు గురి చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలొచ్చాయి. వాటి విషయంలో ఫీడ్ బ్యాక్ ఏమంత గొప్పగా లేదు. మొదట రిలీజైన ‘అను బేబీ’ తేలిపోయింది. తర్వాత తాను మలయాళం చేసిన ఒక పాట ట్యూన్‌తో శైలజారెడ్డి అల్లుడూ.. అంటూ ఒక పాట చేశాడు. ఆ పాటను తెలంగాణ జానపద గాయని మంగ్లీ ఆలపించింది. అది కూడా యావరేజ్‌గానే ఉంది.

తాజాగా ఎగిరెగిరే అనే పాటను లాంచ్ చేశారు. 'ఇంకేం ఇంకేం..' పాట పాడిన సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతమిది. మిగతా రెంటితో పోలిస్తే ఇది బెటరే కానీ.. గోపీ-సిద్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇది లేదన్నది మాత్రం వాస్తవం. ఆడియోలో బెస్ట్ అనుకున్న పాటల్నే ముందు రిలీజ్ చేస్తుంటారు. మరి ఇవే ఇలా ఉంటే.. ఆడియోలోని మిగతా పాటల సంగతేంటో చూడాలి. సోమవారం ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫుల్ ఆడియో విడుదల కాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు