రంగస్థలం నిర్మాతలకి ఇంకో జాక్‌పాట్‌

రంగస్థలం నిర్మాతలకి ఇంకో జాక్‌పాట్‌

ఇంతవరకు పట్టిందల్లా బంగారం కావడంతో మైత్రి మూవీ మేకర్స్‌ అనతికాలంలోనే తెలుగు చిత్ర సీమలో అగ్ర నిర్మాతలుగా ఎదిగారు. రంగస్థలంతో బాక్సాఫీస్‌ రికార్డులని కొల్లగొట్టిన ఈ సంస్థ అగ్ర శ్రేణి హీరోలతో వరుసగా సినిమాలు తీసి ప్రస్తుతం మధ్యశ్రేణి హీరోలతోను పని చేస్తున్నారు.

వీరి బ్యానర్లో రాబోతోన్న సినిమాల్లో ఒకటి 'డియర్‌ కామ్రేడ్‌'. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ వుంది. 'గీత గోవిందం'తో విజయ్‌ రేంజ్‌ ఏమిటనేది మళ్లీ తెలియడంతో ఈ చిత్రం హక్కుల కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి అయిదు కోట్లు ఇవ్వడానికి కూడా పలువురు ముందుకొస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులకి ఇరవై నుంచి ఇరవై అయిదు కోట్లు ఆఫర్‌ చేస్తోన్న వాళ్లూ వున్నారట.

హీరో రెమ్యూనరేషన్‌ కాకుండా ఈ చిత్రం బడ్జెట్‌ కేవలం పది కోట్లట. ఈ చిత్రానికి అన్ని హక్కులు కలుపుకుని నలభై కోట్లు వచ్చేలా వున్నాయని ఈ క్రేజ్‌ చూస్తోన్న ట్రేడ్‌ వర్గాల వారి అంచనా. డియర్‌ కామ్రేడ్‌ చిత్రం కథ చాలా కొత్తగా వుంటుందని, అర్జున్‌రెడ్డి తరహాలో సంచలనాత్మక లక్షణాలున్నాయని టాక్‌ వుంది. విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ పట్ల పూర్తి అవగాహన రాకముందే అతనికి అడ్వాన్సులిచ్చి సినిమాలు మొదలు పెట్టిన నిర్మాతలందరికీ ఇప్పుడు అతను బంగారు కొండలా తయారయ్యాడు.