టాలీవుడ్ నెక్స్ట్ సెన్సేషన్ ఇదేనా?

టాలీవుడ్ నెక్స్ట్ సెన్సేషన్ ఇదేనా?

గత కొన్నేళ్లలో తెలుగులో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. సరికొత్త ఆలోచనలతో చడీచప్పుడు లేకుండా సినిమాలు తీసేసి.. వాటిని పెద్ద నిర్మాణ సంస్థల అధినేతలకు చూపిస్తే.. వాళ్లు వాటిని టేకప్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం చూస్తున్నాం. ‘పెళ్ళిచూపులు’ తరహా సినిమాలు అలాగే జనాల్లోకి వెళ్లాయి. పెద్ద విజయం సాధించాయి. ఈ కోవలో తాజాగా ‘కేరాఫ్ కంచెర్లపాలెం’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. ‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్సే ఈ చిత్రాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకోవడం విశేషం. ఆ సినిమాకు వేసినట్లే ముందుగానే సెలబ్రెటీల కోసం స్పెషల్ ప్రివ్యూలు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఈ జాబితాలో క్రిష్, కీరవాణి, రాజమౌళి లాంటి ప్రముఖులున్నారు.

రాజమౌళి అయితే ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక బైట్ కూడా ఇచ్చాడు. ఒక సినిమా చూశాక కొన్ని రోజుల పాటు దాని తాలూకు అనుభూతులు మనతోనే ఉంటే.. అందులోని పాత్రల్ని తమ వెంటే తీసుకెళ్తే అది ప్రత్యేకమైన సినిమా అవుతుందని.. అలాంటి లక్షణాలు ‘కేరాఫ్ కంచెర్లపాలెం’లో ఉన్నాయని జక్కన్న అన్నాడు. మామూలుగా తాను ఒక సినిమా నచ్చితే నచ్చిందని చెబుతానని.. అంతే తప్ప కచ్చితంగా చూడమని చెప్పనని.. కానీ ఈ సినిమా విషయంలో చెప్పాల్సి వస్తోందని... అంతగా ఇది తనపై ప్రభావం చూపిందని.. సినిమా చూసి కొన్ని రోజులైనా ఇంకా మైండ్ నుంచి పోవట్లేదని రాజమౌళి చెప్పాడు. జక్కన్న అంతటి వాడు ఓ సినిమా గురించి ఇంతగా చెబితే జనాలకు దానిపై ఎంత ఆసక్తి పుడుతుందో.. ఆ సినిమాకు ఈ మాటలు ఎంతగా కలిసొస్తాయో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. కంచెర్లపాలెం అనే ఊరిలో అక్కడి వాళ్లతోనే అతనీ సినమా తీయడం విశేషం. సెప్టెంరబు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు