రియ‌ల్ లైఫ్ లో గీత‌కు ఛాన్సే లేద‌నేశాడు

రియ‌ల్ లైఫ్ లో గీత‌కు ఛాన్సే లేద‌నేశాడు

తాజా సంచ‌ల‌నం గీతాగోవిందం. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి "రౌడీ".. గోవిందంలా మారితే ఎవ‌రికి మాత్రం ఆస‌క్తి ఉండ‌దు. దీనికి తోడు ఎక్క‌డా ప‌ట్టుత‌ప్ప‌ని క‌థ‌నం తోడైతే.. బ్లాక్ బ‌స్ట‌రే. అర్జున్ రెడ్డి త‌ర్వాత తాను న‌టించిన గీతా గోవిందం సూప‌ర్ హిట్ కావ‌ట‌మే కాదు.. భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న వైనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు విజ‌య్. ఇలాంటి వేళ‌.. ఆయ‌న ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను.. రియ‌ల్ లైఫ్ లో గీత‌లాంటి అమ్మాయి వెంట ప‌డ‌తారా?  అంటే.. ఆస‌క్తిక‌రంగా రియాక్ట్ అయ్యారు. నిజ‌జీవితంలో గీత లాంటి అమ్మాయి ఎదురుప‌డే ఛాన్సే లేద‌నేశారు. త‌న‌కు చాలా ఆశ‌లు.. ఆశ‌యాలు ఉన్నాయ‌ని.. వాటిని గౌర‌వించి.. అర్థం చేసుకొని ప్రోత్స‌హించే అమ్మాయి కావ‌ల‌ని చెప్పాడు. త‌న‌కు ఓపిక చాలా త‌క్కువ‌ని.. తొంద‌ర‌గా చికాకు వ‌చ్చేస్తుంద‌న్నారు. కండీష‌న్లు పెట్టే అమ్మాయి.. ఇది చేయ్.. అది చేయ్ అంటే మాత్రం త‌న‌కు వ‌ల్ల కాద‌నేశాడు.

త‌న‌కూ గోవింద్ కి అస్స‌లు సంబంధం లేద‌ని.. గీతా గోవిందం క‌థ విన్న‌ప్పుడు త‌న‌కే వింత‌గా అనిపించింద‌ని చెప్పాడు. నా కోస‌మే ఒక అమ్మాయి పుట్టాలి.. నా కోస‌మే అందంగా త‌యార‌వ్వాలంటూ త‌న‌కు కాబోయే భార్య గురించి క‌ల‌లు క‌నే పాత్ర గోవింద్‌ద‌ని.. ఈ రోజుల్లో అలాంటి అబ్బాయిలు ఉంటారా? అని త‌న‌కు అనిపించిన‌ట్లు చెప్పాడు.

తానైతే.. అలాంటి టైపు కాద‌ని.. ప్ర‌తి అమ్మాయికి స్వతంత్ర భావాలు ఉండాల‌ని.. వారికంటూ కొన్ని ఇష్టాలు ఉండాల‌ని అనుకున్నాన‌ని.. కానీ ఈ సినిమా చేసిన‌ప్పుడు మాత్రం త‌న అభిప్రాయాలు కొన్ని మారిన‌ట్లుగా వెల్ల‌డించారు. మొత్తానికి రీల్ లైఫ్.. రియ‌ల్ లైఫ్ ఏ మాత్రం సంబంధం ఉండ‌ద‌న్న విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ తేల్చేసిన వైనం ఆక‌ట్టుకునేలా ఉంది క‌దూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు