ఈ కొత్త టీజరేదో బాగుందే..

ఈ కొత్త టీజరేదో బాగుందే..

ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. దాని టీజర్, ట్రైలర్ బాలేకుంటే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సినిమా పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో టీజరో ట్రైలరో ఇంప్రెసివ్‌గా ఉంటే ఎంత చిన్న సినిమా అయినా పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచి విజయం సాధించిన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’.. ‘గీత గోవిందం’.. ఇవన్నీ కూడా ప్రోమోలతోనే ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగాయి. జనాల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. తాజాగా అందరూ కొత్త వాళ్లు కలిసి చేస్తున్న ఒక సినిమా టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ సినిమా పేరు ‘హల్ చల్’. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన రుద్రాక్ష్ ఉత్కమ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటించింది. శ్రీపతి కర్రి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఇందులో హీరో అనుకోకుండా హల్ చల్ అనే డ్రింక్ తాగుతాడు. అది తాగిదే ఏదో నిజమో.. ఏది భ్రమో అర్థం కాదు. హీరో నిజాన్ని భ్రమ అనుకుంటాడు.. భ్రమను నిజం అనుకుంటాడు. దీని వల్ల అతడికి చాలా పెద్ద సమస్యలే ఎదురవుతాయి. టీజర్ అయితే చాలా వినోదాత్మకంగా సాగిపోయింది. సినిమా కూడా అలాగే ఉండేలా ఉంది. హీరో రుద్రాక్ష్ యాక్టింగ్ కూడా బాగుంది. క్రైమ్ కామెడీ స్టయిల్లో సినిమా సాగేట్లు కనిపిస్తోంది. ఇందులో రవిప్రకాష్.. కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా కాన్సెప్ట్ అయితే ఫన్నీగా.. ఆసక్తికరంగా అనిపిస్తోంది. టీజర్ వరకు బాగానే కట్ చేశారు. మరి ఈ కాన్సెప్ట్ ఎలా డీల్ చేశారు.. సినిమా అంతా ఇంతే ఆసక్తికరంగా ఉంటుందా అన్నది చూడాలి. టీజర్ ఉన్నంత బాగా సినిమా కూడా ఉంటే.. మంచి విజయమే సాధించే అవకాశముంది. ఈ చిత్రాన్ని గణేష్ కొల్లూరి నిర్మించాడు. అందరూ కొత్త టెక్నీషియన్లే ఈ చిత్రానికి పని చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు