విశ్వరూపం-2.. వదిలేసినా బాగుండే

విశ్వరూపం-2.. వదిలేసినా బాగుండే

‘విశ్వరూపం’ చూసిన వాళ్లంతా ‘విశ్వరూపం-2’ కోసం ఎంతగా ఎదురు చూశారో? ఇలా ఓ సినిమా కోసం అన్నేళ్ల పాటు అంత ఆసక్తిగా ఎదురు చూడటం అరుదు. ‘విశ్వరూపం’ తీస్తున్నపుడే రెండో భాగం చిత్రీకరణ కూడా సగం దాకా పూర్తి చేశాడు కమల్. మిగతా భాగం కూడా ‘విశ్వరూపం’ విడుదలైన ఏడాదే కానిచ్చేశాడు. కాబట్టి ‘విశ్వరూపం’లో కనిపించిన బ్రిలియన్స్ అందులోనూ కచ్చితంగా ఉంటుందని.. ఇది కూడా అంతే ఆసక్తికరంగా సాగుతుందని.. సినిమా మంచి థ్రిల్ ఇస్తుందని ఆశించారు. కానీ సినిమా చూశాక ఈ ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. దీంతో ‘విశ్వరూపం’ ఫ్యాన్స్ అందరూ.. ఈ సీక్వెల్ విడుదల కాకుండా ఆగిపోయినా బాగుండేదే అనుకుంటున్నారు. ‘విశ్వరూపం’ చూశాక కలిగిన గొప్ప అనుభూతి అలాగే ఉండేదంటున్నారు.

ఇక ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా కమల్ సాధించింది కూడా పెద్దగా ఏమీ లేదు. వాస్తవానికి ఈ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్. అతను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతోనే సినిమా అన్నేళ్ల పాటు ఆగిపోయింది. చివరికి కమల్ ఆ సినిమాను తనే టేకప్ చేశాడు. సొంత ఖర్చుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేశాడు. వడ్డీలతో కలిపి ఫైనాన్సులు క్లియర్ చేశాడు. ఇంతా చేస్తే సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. విడుదల తర్వాతైనా డబ్బులు వెనక్కి వస్తే గిట్టుబాటు అవుతుందని ఆశించాడు. కానీ ఈ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది. తెలుగులో ఈ చిత్రం వీకెండ్ వరకు కూడా నిలవలేకపోయింది. కొన్ని రోజుల్లోనే  అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ షేర్ చాలా నామమాత్రంగా వచ్చింది. ఇక తమిళంలో పరిస్థితి పర్వాలేదు కానీ.. సినిమా మీద పెట్టిన ఖర్చుతో పోలిస్తే పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. వీటన్నింటికీ తోడు కమల్ చివరి సినిమాగా ‘విశ్వరూపం-2’ లాంటి చిత్రాన్ని గుర్తుంచుకోవాల్సి రావడం అభిమానులకు బాధకలిగించే విషయం.