'లగాన్' సినిమాను అమీర్ వద్దన్నాడట

'లగాన్' సినిమాను అమీర్ వద్దన్నాడట

ఇండియాలో ఇంకెవ్వరికీ సాధ్యం కాని ఉన్నత శిఖరాల్ని అందుకున్న కథానాయకుడు అమీర్ ఖాన్. సినిమాల ఎంపికలో, క్రెడిబిలిటీలో, వసూళ్ల మోత మోగించడంలో అమీర్ తర్వాతే ఎవ్వరైనా. గత రెండు దశాబ్దాల్లో అమీర్ నుంచి ఎలాంటెలాంటి సినిమాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. చివరగా అమీర్ నుంచి వచ్చిన ‘దంగల్’ సినిమా ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు సాధించింది. చైనాలో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అమీర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి కారణమైన సినిమా ‘లగాన్’. ఆ చిత్రంలో అప్పట్లో సంచలన విజయం సాధించింది. దానికి నిర్మాత కూడా అమీరే. అది నటుడిగా.. నిర్మాతగా అమీర్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.

ఐతే అశుతోష్ గోవారికర్ ముందు ఈ కథ చెప్పినపుడు అమీర్ తానీ సినిమా చేయనని అనేశాడట. 200 ఏళ్ల కిందటి కథ.. వర్షాల్లేక ఇబ్బంది పడుతున్న అప్పటి జనం క్రికెట్ మ్యాచ్ ఆడి శిస్తు రద్దు చేయించుకోవడం అంటూ ఈ కథను అశుతోష్ చెప్పినపుడు ఇదేం పిచ్చి కథ అని కొట్టి పారేశాడట అమీర్. కానీ కొన్ని నెలల తర్వాత అశుతోష్ ఫోన్ చేసి స్క్రిప్టు వినమంటే ఆ క్రికెట్ కథైతే తాను చేయనని కుండబద్దలు కొట్టేశాడట. కానీ అశుతోష్ బలవంతం మేరకు అతడి స్నేహాన్ని గౌరవించి ‘లగాన్’ కథ విన్నానని.. కానీ పూర్తి స్క్రిప్టు విని.. అందులో సన్నివేశాల గురించి తలచుకుంటే తనకు మతి పోయిందని అమీర్ చెప్పాడు. కాబట్టి కథను బట్టి ఒక సినిమాపై అంచనాకు రాకూడదని.. పూర్తి స్క్రిప్టును బట్టే దాన్ని జడ్జ్ చేయాల్సి ఉంటుందని అమీర్ చెప్పాడు. రచయితలకు ఇండస్ట్రీలో సరైన గౌరవం దక్కట్లేదని.. వాళ్లకు పారితోషకాలు పెరగాలని.. అందరి కంటే ముందు వాళ్లకు డబ్బులివ్వాలని అమీర్ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు