తమిళనాట ‘గీత గోవిందం’ సంచలనం

తమిళనాట ‘గీత గోవిందం’ సంచలనం

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘గీత గోవిందం’ తొలి రోజు ఎలాంటి వసూళ్లు సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు మంచి హైప్ ఉన్న మాట వాస్తవమే కానీ.. మరీ ఏకంగా పది కోట్ల దాకా షేర్ సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. తర్వాతి రోజు కూడా ఈ చిత్రం దూకుడు కొనసాగిస్తోంది. వీకెండ్లో కూడా భారీ వసూళ్లే వస్తాయిన అంచనా వేస్తున్నారు. వారాంతానికల్లా బయ్యర్ల పెట్టుబడి వెనక్కి వచ్చి అందరూ లాభాల బాట పడితే ఆశ్చర్యం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అవతల కూడా ‘గీత గోవిందం’ ఇరగాడేస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ చిత్రం సాధించిన వసూళ్ల లెక్కలు వింటే షాకవ్వాల్సిందే. ఈ చిత్రం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే రూ.1.3 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. వీకెండ్ అయ్యేసరికి అక్కడ వసూళ్లు రూ.3 కోట్ల మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్లకు సైతం తమిళనాట ఇలాంటి ఓపెనింగ్స్ రావు. ‘స్పైడర్’తో నేరుగా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మహేష్ బాబు.. ఆ తర్వాత నటించిన ‘భరత్ అనే నేను’ను తమిళనాట పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. దానికి కూడా తొలి రోజు ఇంతటి వసూళ్లు రాలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్‌కి తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ చిత్రం చెన్నైలో ఇరగాడేసింది. పది రోజుల పాటు హౌస్ ఫుల్స్‌తో నడిచింది. తమిళ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆ సినిమా చూశారు. కోలీవుడ్ ప్రముఖులందరూ కూడా ‘అర్జున్ రెడ్డి’ చూసి స్టన్ అయిపోయారు. ఐతే ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడుతుండగానే.. రీమేక్ కన్ఫమ్ కావడంతో థియేటర్ల నుంచి తీయించేశారు. ఆ సినిమాతో వచ్చిన ఫాలోయింగ్ కలిసొచ్చి విజయ్ కొత్త సినిమా ‘గీత గోవిందం’ పెద్ద ఎత్తున రిలీజైంది. ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్నారు తమిళ జనాలు. ఇక తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’తో విజయ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు