'బిచ్చగాడు' దర్శకుడు మళ్లీ తెలుగులోకి..

'బిచ్చగాడు' దర్శకుడు మళ్లీ తెలుగులోకి..

రెండేళ్ల కిందట ‘బిచ్చగాడు’ సినిమా తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఆ చిత్రం మౌత్ టాక్‌తో పెద్ద రేంజికి వెళ్లిపోయింది. దీని ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ వెలవెలబోయింది. ఏకంగా రూ.30 కోట్ల దాకా గ్రాస్ సాధించిన ఆశ్చర్యపరిచింది ‘బిచ్చగాడు’ సినిమా. ఈ చిత్రంతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ.. తర్వాత వరుసబెట్టి తన సినిమాలన్నింటినీ తెలుగులోకి తీసుకొచ్చాడు. కానీ అందులో ఒక్కటీ విజయవంతం కాలేదు.

అతడి సంగతలా వదిలేస్తే ఈ చిత్ర దర్శకుడు శశి మాత్రం ‘బిచ్చగాడు’ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా తీయలేదు. ‘బిచ్చగాడు’తో తనపై పెరిగిన అంచనాలకు తగ్గట్లు సినిమా తీయడం కోసమే అతను బాగా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు శశి తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాడు. అతడి కొత్త సినిమాలో సిద్దార్థ్ హీరో కావడం విశేషం. ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన సిద్ధు.. తర్వాత కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. కొన్నేళ్ల పాటు అతడి సినిమాలేవీ తెలుగులో రిలీజ్ కూడా కాలేదు. ఐతే గత ఏడాది ‘గృహం’ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం మంచి ఫలితమే అందుకుంది. ఇప్పుడు శశి దర్శకత్వంలో అతను నటిస్తున్నాడు.

ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శశి ఇంతకుముందు డైరెక్టుగా తెలుగులోనూ ఒక సినిమా చేసిన సంగతి చాలా మందికి గుర్తు లేదు. తమిళంలో తాను తీసిన సూపర్ హిట్ మూవీ ‘సొల్లామలే’కు రీమేక్ అయిన ‘శ్రీను’కు అతనే దర్శకుడు. ఆ సినిమా ఆడలేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత ‘బిచ్చగాడు’తో పలకరించి భారీ విజయాన్నందుకున్నాడతను. మరి సిద్ధుతో అతను చేస్తున్న కొత్త సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English