అతడితోనే పెళ్లి అంటున్న రష్మిక

అతడితోనే పెళ్లి అంటున్న రష్మిక

రష్మిక మందానా.. టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ‘గీత గోవిందం’లో కథానాయికగా అదరగొట్టిన కన్నడ అమ్మాయి. ఆల్రెడీ ‘ఛలో’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టింది. వరుసగా రెండు భారీ విజయాలందుకుంటే ఇక ఆ కథానాయికకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో చెప్పేదేముంది..? టాలీవుడ్లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ రష్మికే అంటున్నారంతా. ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండతోనే ‘డియర్ కామ్రేడ్’ అనే మరో సినిమాతో పాటు నాగార్జున-నానిల ‘దేవదాస్’లోనూ కథానాయికగా నటిస్తున్న రష్మిక మున్ముందు తెలుగులో మరింత బిజీ అయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్లో తనకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కెరీర్ కోసం రక్షిత్ శెట్టితో తన ఎంగేజ్మెంట్‌ను రద్దు చేసుకుందని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్తల్ని రష్మిక మేనేజర్ ఖండించాడు కానీ.. ఆమె మాత్రం సైలెంటుగానే ఉంటుండటంతో జనాలకు అనుమానాలు పెరిగిపోయాయి. నిజంగా రక్షిత్‌తో ఆమె పెళ్లి ఉంటుందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఐతే ఈ చర్చలకు రష్మిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను ఇంకా రక్షిత్‌తో రిలేషన్‌షిప్‌లోనే ఉన్నానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. కన్నడలో తన తొలి సినిమా ‘కిరిక్’ పార్టీ చేస్తున్న సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత అయిన రక్షిత్‌తో ప్రేమలో పడ్డానని.. తమ మనసులు, ఆలోచనలు, అభిప్రాయాలు బాగా కలిశాయని.. పెళ్లి చేసుకోవాలనుకున్నామని ఆమె చెప్పింది. నిశ్చితార్థం చేసుకున్నామని.. పెళ్లికి మాత్రం ఇంకా సమయం కావాలనుకున్నామని.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో కరెక్టుగా చెప్పలేమని.. కానీ అతడినే పెళ్లాడతానని.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని రష్మిక స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు