మహేష్ ఎంత మారిపోయాడబ్బా..

మహేష్ ఎంత మారిపోయాడబ్బా..

మహేష్ బాబు ఒకప్పుడు ఎంత రిజర్వ్డ్‌గా ఉండేవాడో తెలిసిందే. తన సినిమాల వేడుకలకే వచ్చేవాడు కాదు. ప్రమోషన్లలో పాల్గొనేవాడు కాదు. మీడియాను కలిసేవాడు కాదు. వాణిజ్య కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు కాదు. కానీ తర్వాతి కాలంలో అతడిలో చాలా మార్పు వచ్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా దానికి ప్రమోషన్ ఎంత కీలకమో.. దాని ద్వారా సినిమాను ఇంకా పెద్ద రేంజికి ఎలా తీసుకెళ్లవచ్చో గుర్తించి తన చిత్రాల్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. దీన్ని మిగతా హీరోలు కూడా అనుసరించారు. అలాగే తెలుగులో పెద్ద ఎత్తున బ్రాండ్లకు ప్రచారం చేయడం మొదలుపెట్టడం ద్వారా మిగతా హీరోలకూ ఈ విషయంలో స్ఫూర్తినిచ్చాడు. ఇన్ని చేసినా.. వేరే హీరోలతో కలవడని.. వేరే సినిమాల గురించి మాట్లాడడని అతడిపై విమర్శలుండేవి. కానీ ఈ విషయంలోనూ అతను మారిపోయాడు.

ఈ మధ్య మహేష్ బాగా సంఘజీవి అయిపోయాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లను తరచుగా కలుస్తున్నాడు. అలాగే వేరే హీరోల సినిమాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అతను తరచుగా సినిమాలు చూస్తూ వాటి గురించి స్పందిస్తుండటం విశేషం. ఇంతకుముందు మహా అయితే తన బావ సుధీర్ బాబు సినిమా గురించి మాత్రమే మాట్లాడేవాడు. కానీ ఈ మధ్య వేరే సినిమాలు చాలానే చూసి స్పందించాడు మహేష్. రెండు వారాల కిందట రిలీజైన ‘గూఢచారి’ సినిమాపై మహేష్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ‘గీత గోవిందం’ను కూడా మహేష్ తొలి రోజే చూసి స్పందించాడు. ఆ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. వీటి కంటే ముందు కూడా మహేష్ చాలా సినిమాల గురించి మాట్లాడాడు. అంతే కాదు.. కొన్ని సినిమాల టీజర్లు.. ట్రైలర్లు లాంచ్ చేసి విష్ చేయడం.. సినీ ప్రముఖుల పుట్టిన రోజుల సందర్భంగానూ శుభాకాంక్షలు చెబుతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు