తమన్నా-సందీప్ సినిమా ఏమైంది?

తమన్నా-సందీప్ సినిమా ఏమైంది?

ఒక రెండేళ్ల ముందు వరకు కూడా తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది తమన్నా. దాదాపు దశాబ్దం నుంచి తమ్మూ ఇక్కడ హవా సాగిస్తోంది. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీలో నటించిన దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన మిల్కీ బ్యూటీ.. దీని తర్వాత మరిన్ని పెద్ద అవకాశాలు అందుకుంటుందని.. ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా సీన్ రివర్సయింది. ‘బాహుబలి’ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని పారితోషకం పెంచడంతో ఆమె నిర్మాతలకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ క్రమంలో కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది. కెరీర్ గాడి తప్పింది. దీనికి తోడు వరుస ఫ్లాపులు  కూడా ఆమెను దెబ్బ తీశాయి. చివరగా తమన్నా నుంచి వచ్చిన ‘నా నువ్వే’ ఫలితమేంటో తెలిసిందే.

ప్రస్తుతం తమన్నా ఆశలన్నీ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ మీదే ఉన్నాయి. దానికి కూడా పెద్దగా బజ్ లేదు. మరోవైపు తమన్నా నటించిన ఇంకో సినిమా అతీ గతీ లేకుండా పోయింది. గతంలో అమీర్ ఖాన్ తో ‘ఫనా’ సినిమా తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి ఆశ్చర్యకరంగా తెలుగులో తమన్నా-సందీప్ కిషన్‌లను పెట్టి ఒక సినిమా చేశాడు. ఆ సినిమా చాలా వరకు లండన్లోనే షూటింగ్ జరుపుకుంది. గత ఏడాదే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. కానీ ఆ తర్వాత ఇది వార్తల్లో లేకుండో పోయింది. ఈ లోపు తమన్నా డిమాండ్ పడిపోయింది. సందీప్ కిషన్ ట్రాక్ రికార్డు మరింత దారుణంగా తయారైంది. తెలుగులో పూర్తిగా అతడి మార్కెట్ పడిపోయింది. దీంతో ఈ చిత్రంపై ఎవరికీ ఆసక్తి లేకపోయింది. సినిమాకు బిజినెస్ కూడా జరిగే పరిస్థితి లేదు. దీంతో ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయకుండా మధ్యలో వదిలేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు ఎలా బయటికి తీసుకొస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు