చైతూ-సమంత.. మజిలీ?

చైతూ-సమంత.. మజిలీ?

‘ఏమాయ చేసావె’.. ‘మనం’ లాంటి మరపురాని సినిమాల్లో జంటగా నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత.. మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పెళ్లి తర్వాత చైతూ-సమంత కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పెళ్లయిన ఓ జంట జీవితంలో తలెత్తే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. దీనికి ‘మజిలీ’ అనే పేరు ఖరారు చేశారట. ఇప్పటిదాకా ఎవరూ వాడని ఆసక్తికర టైటిల్ ఇది. ఒక పెళ్లయిన జంట జీవిత ప్రయాణాన్ని చూపిస్తున్న సినిమా కాబట్టి దీనికి ‘మజిలీ’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సమంతతో తనకు ఇప్పటికే పెళ్లయిందని.. ఇప్పుడు తాను లవర్‌గా మారి ఆమె వెంట పడితే బాగోదని.. అందుకే తాము మళ్లీ కలిసి చేసే చిత్రం భిన్నంగా ఉండాలని భావించి.. పెళ్లయిన జంట కథను ఓకే చేశామని చైతూ వెల్లడించిన సంగతి తెలిసిందే. చైతూ జీవితంలోకి కొత్తగా వచ్చిన మరో అమ్మాయి కారణంగా ఇందులో అతడికి, సమంతకు మధ్య విభేదాలు తలెత్తుతాయట.

ఓ హిందీ టీవీ సీరియల్ నటి ఆ అమ్మాయి పాత్రలో నటించనుంది ఈ చిత్రంలో. ‘నిన్ను కోరి’లో పెళ్లి తర్వాత ప్రేమలో ఉండే గొప్పదనాన్ని చాలా పరిణతితో చెప్పాడు శివ. ఐతే అది పూర్తిగా పెళ్లి తర్వాతి ప్రేమ నేపథ్యంలో ఉండదు. అదొక పార్ట్ మాత్రమే. కానీ ‘మజిలీ’లో మాత్రం పూర్తిగా ఇదే పాయింట్ అన్నమాట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు