‘అరవింద’ టీజర్లో సునీల్‌ను చూశారా?

‘అరవింద’ టీజర్లో సునీల్‌ను చూశారా?

కమెడియన్‌గా స్టార్ స్టేటస్ అందుకుని.. ఆ తర్వాత హీరోగా మారాడు సునీల్. మొదట్లో తన కమెడియన్ ఇమేజ్‌కు తగ్గ పాత్రలతో బాగానే అడుగులు వేశాడు కానీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు. రెగ్యులర్ మాస్ హీరోల్లాగే విన్యాసాలు చేయబోయి బొక్క బోర్లా పడ్డాడు. వరుస డిజాస్టర్లతో హీరోగా కెరీర్‌ను పూర్తిగా చెడగొట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు మళ్లీ కామెడీ వేషాలపైకి అతడి మనసు మళ్లింది.

కమెడియన్‌గా రెండో ఇన్నింగ్స్‌లో సునీల్‌కు మంచి ఛాన్సులే వస్తున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో సునీల్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న ‘అరవింద సమేత’లోనూ సునీల్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఆ విషయం నిజమే అని తాజాగా రిలీజైన ‘అరవింద సమేత’ టీజర్‌తో కన్ఫమ్ అయింది. ఈ చిత్ర టీజర్లో సునీల్ మెరుపులా కనిపించి మాయమయ్యాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అతను టీజర్లో ఉన్న సంగతి అర్థం కాదు. ఒక షాట్లో ఎన్టీఆర్ కుర్చీతో పాటు అలాగే పైకి ఎగిరి కూర్చోవడం గమనించే ఉంటారు. ఆ షాట్‌లోనే ఒక పక్కగా కనిపిస్తాడు. మెరూన్ కలర్ టీషర్టు వేసుకున్నాడు సునీల్ ఈ సీన్లో.

మొత్తానికి ఇలా ‘అరవింద సమేత’లో సునీల్ కూడా ఉన్న సంగతి ధ్రువీకరణ అయింది. మరి తన మిత్రుడి కోసం త్రివిక్రమ్ ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడు.. సినిమాలో అతడికి ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుంది.. మధ్యలో తన కామెడీ టైమింగ్ అంతా మిస్సయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎప్పట్లాగే కామెడీ పండించగలడా అన్నది ఆసక్తికరం. ఈ ప్రశ్నలకు అక్టోబరు 11న సమాధానం లభించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు