ఇక్కడ బసవతారకం.. అక్కడ జయలలిత

ఇక్కడ బసవతారకం.. అక్కడ జయలలిత

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ భారీ విజయం సాధించడంతో దక్షిణాదిన బయోపిక్‌లకు మాంచి ఊపే వచ్చింది. ఆల్రెడీ తెలుగులో ఎన్టీఆర్, వైఎస్సార్‌ల బయోపిక్స్ భారీ ఎత్తున తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే సౌత్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా త్వరలోనే సినిమా మొదలు కాబోతోంది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైబ్రి మీడియా ధ్రువీకరించింది. విష్ణు ఇందూరి సారథ్యంలోని ఈ సంస్థ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌ను, హిందీలో కపిల్ దేవ్ బయోపిక్‌ను నిర్మిస్తోంది. ఇప్పుడు జయలలిత సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ఆ చిత్రం ముందుకొచ్చింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ లాంచ్ చేసి.. అదే రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతోంది చిత్ర బృందం. ‘నాన్న’.. ‘కణం’ చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఐతే ఇందులో జయలలిత పాత్ర ఎవరు చేస్తారన్న చర్చ కొన్ని నెలల ముందు నుంచే నడుస్తోంది. ‘మహానటి’లో సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్ పేరు ముందు తెరమీదికి వచ్చింది కానీ.. ఆమే స్వయంగా ఈ సినిమాలో నటించే ఉద్దేశం లేదని చెప్పేసింది. తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ లీడ్ రోల్ చేస్తుందట.

ప్రస్తుతం ఆమె తెలుగులో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో రామారావు సతీమణి బసవతారకం పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ లుక్ పరంగా కూడా జయలలితను మ్యాచ్ చేయగలదని.. ఆమె ఈ పాత్రను బాగా పండించగలదని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు సిల్క్ స్మిత జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’లో అద్భుత అభినయంతో విద్య జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు