‘సైరా’ టీం క్లారిటీ ఇచ్చేసింది

‘సైరా’ టీం క్లారిటీ ఇచ్చేసింది

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కబురు రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు ‘సైరా’ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరు పుట్టిన రోజుకు ఏదో ఒక కానుక ఉంటుందన్న అంచనాలున్నాయి కానీ.. ఫస్ట్ లుక్‌తో సరిపెట్టకుండా టీజరే రిలీజ్ చేస్తుండటంతో దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. టీజర్ లాంచ్ గురించి ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ చిత్ర సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చేసింది ‘సైరా’ టీం.

‘సైరా’ విషయంలో అత్యంత సందిగ్ధతకు దారి తీసిన విషయం.. ఈ చిత్రానికి ఎవరు సంగీతం అందిస్తారనేదే. వాస్తవానికి ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వాల్సింది. కానీ ఆయన అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత మోషన్ పోస్టర్‌కు మ్యూజిక్ ఇచ్చిన తమన్ పేరు తెరపైకి వచ్చింది. కీరవాణి పేరూ చర్చకు వచ్చింది. చివరగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది లైన్లోకి వచ్చాడు. కానీ అతడి పేరూ ఖరారైనట్లు చిత్ర బృందం ఇన్ని రోజులూ ధ్రువీకరించలేదు. ఐతే తాజా పోస్టర్ మీద సంగీత దర్శకుడిగా త్రివేది పేరు పడిపోయింది. కాబట్టి ఇక ఈ విషయంలో సందేహాల్లేవు. ఇక ‘సైరా’ కథ కోసం అరడజను మంది దాకా రచయితలు పని చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ పోస్టర్ రచన క్రెడిట్ పరుచూరి సోదరులకు ఇచ్చారు. డైలాగ్ రైటర్‌గా సాయిమాధవ్ బుర్రా పేరు వేశారు. స్క్రీన్ ప్లే అంటూ ప్రత్యకంగా క్రెడిట్ వేయలేదు. ‘ఎ సురేందర్ రెడ్డి ఫిలిం’ అని దర్శకుడిగా అతడికి క్రెడిట్ ఇచ్చారు. రైటింగ్, స్క్రీన్ ప్లేకు సంబంధించి సినిమాలో వివరంగా క్రెడిట్స్ ఇచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు