దేవరకొండ పాటను లేపేశారే..

దేవరకొండ పాటను లేపేశారే..

‘గీత గోవిందం’ సినిమా విడుదలకు ముందు హీరో విజయ్ దేవరకొండ పాడిన ‘వాట్ ద ఎఫ్’ పాట ఎంత వివాదం రాజేసిందో తెలిసిందే. మొదలవడమే ఒక బూతును సూచించేలా పాట మొదలవడం.. మధ్యలో రాముడు-సీతకు సంబంధించి కొన్ని వివాదాస్పద లైన్లు ఉండటంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఐత వెంటనే యూట్యూబ్ నుంచి ఈ పాటను తీయించేసి.. అభ్యంతకరకంగా ఉన్న పదాలన్నీ తీసేసి కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. ఈ పాటలో సాహిత్యం సంగతలా ఉంచితే.. విజయ్ దేవరకొండ పాట పాడిన తీరు మీదా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఈ విషయమై ఆడియో వేడుకలో చాలా సరదాగా స్పందించాడు విజయ్. తనపై జరిగిన ట్రోలింగ్.. వచ్చిన మీమ్స్ అన్నీ డిస్ ప్లే చేసి అతను జనాల్ని భలేగా నవ్వించాడు.

ఆ సందర్భంగానే ఈ పాటను ఎవరైనా తమ స్టయిల్లో పాడి పంపొచ్చని.. అందులో నచ్చిన వెర్షన్ చూసుకుని వాళ్లతోనే పాట పాడించి సినిమాలో పెడతామని అతనన్నాడు. మరి ఇలా ఎంపిక చేసిన సింగర్ తో పాడించారా.. ఎవరైనా తెలిసిన సింగర్ తోనే పాడించారా అన్నది తెలియదు కానీ.. సినిమాలో మాత్రం విజయ్ పాట వినిపించలేదు. దాన్ని తీసేసి వెరే వెర్షన్ పెట్టారు. ఇది విజయ్ అభిమానులకు ఒకింత నిరాశనే మిగిల్చింది. విజయ్ గొంతు ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ అతడి వాయిస్ లోనే పాట ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఆ పాటలో విజయ్ యాటిట్యూడ్ అంతా కనిపిస్తుంది. స్టెప్పులు కూడా చాలా ఫన్నీగా వేశాడు. వాయిస్ కూడా అతడిదే ఉంటే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేసేవాళ్లేమో అనిపిస్తుంది. మరి ఎందుకతడి పాట తీసి వేరే రీప్లేస్ చేశారో?