పాపం.. నాగబాబుకు డబ్బింగ్ చెప్పించారు

పాపం.. నాగబాబుకు డబ్బింగ్ చెప్పించారు

సినిమా డబ్బింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తి కొన్నిసార్లు ప్రముఖ నటీనటులకు కూడా వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. కొందరు ఆర్టిస్టులకు డబ్బులు లేదా ఇంకేదైనా విషయంలోనో తేడాలొచ్చి డబ్బింగ్ చెప్పకుండా హ్యాండిస్తుంటారు. ఐతే గీతా ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కిన ‘గీత గోవిందం’లో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ పాత్ర తొలి డైలాగ్ విన్నపుడే వాయిస్ ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. కాసేపటికి కానీ అర్థం కాదు.. ఆ పాత్రకు వేరెవరో డబ్బింగ్ చెప్పారని. మరి నాగబాబు వాయిస్‌కు ఏమైంది..? ఆయనెందుకు డబ్బింగ్ చెప్పలేదు..? ఇందుక్కారణం ఆయన గొంతు పాడైపోవడమే.

నాగబాబు గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని నెలల కిందటే బొంగురుపోయింది. జబర్దస్త్ ప్రోగ్రాం చూసేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆయన జడ్జిగా మాట్లాడేటపుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాయిసే సరిగా రావట్లేదు. ఈ మధ్య మరీ ఇబ్బందికరంగా తయారై అసలు మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గీత గోవిందం’లో హీరో తండ్రి పాత్రలో నటించిన ఆయన తన వాయిస్ ఇవ్వలేకపోయారు. మరీ ఇన్ని నెలల పాటు గొంతు బొంగురు పోయి ఇప్పుడీ స్థాయికి చేరుకుందంటే సమస్య కొంచెం తీవ్రమైందే అని భావించాలి. ఇది కెరీర్‌కు కూడా ఇబ్బందికరంగా మారుతోంది కాబట్టి వెంటనే పరిష్కారం చూడాల్సిన అవసరముంది. నాగబాబు ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నారట. ఆయన సర్జరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు