దేవరకొండకు 25 మంది హీరోయిన్లు నో!

దేవరకొండకు 25 మంది హీరోయిన్లు నో!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేశారు. హీరోయిన్లు సైతం విజయ్‌తో జోడీ కట్టడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఐతే ‘అర్జున్ రెడ్డి’ కంటే ముందు విజయ్ కమిటైన ‘గీత గోవిందం’కు మాత్రం హీరోయిన్ విషయంలో చాలా ఇబ్బంది ఎదురైందట. హీరోయిన్ ఓకే కాకపోవడంతోనే తాను తొమ్మిది నెలల పాటు ఈ సినిమాను మొదలుపెట్టకుండా ఆగాల్సి వచ్చిందని దర్శకుడు పరశురామ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టాలీవుడ్‌తో పాటు వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లను తాను ఈ పాత్ర కోసం సంప్రదించానని.. మొత్తంగా 25 మంది దాకా ఈ పాత్రకు నో చెప్పారని పరశురామ్ తెలిపాడు.

‘అర్జున్ రెడ్డి’కి ముందు విజయ్ కి పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో అతడితో నటించడానికి కొంతమంది హీరోయిన్లు ఆసక్తి చూపించలేదని పరశురామ్ తెలిపాడు. చివరికి రష్మిక మందానా ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చిందని.. ఐతే వెంటనే డేట్లు అందుబాటులో లేకపోవడంతో తన కోసమే మూడు నెలలు ఎదురు చూడాల్సి వచ్చిందని.. ఆమెను చూశాక.. కథ నరేట్ చేశాక మాత్రం గీత పాత్ర ఆమె కోసమే పుట్టిందనిపించిందని పరశురామ్ చెప్పాడు. ‘గీత గోవిందం’లో హీరోతో పాటు హీరోయిన్‌కూ అంతే ప్రాధాన్యం ఉంటుందని.. ఈ పాత్రలు.. వాటి మధ్య సంఘర్షణ.. విజయ్-రష్మిక కెమిస్ట్రీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని.. ఈ పాత్రలతో యూత్ బాగా రిలేట్ అవుతారని పరశురామ్ చెప్పాడు. తాను ఇంతకుముందే హిట్లు కొట్టినప్పటికీ ‘గీత గోవిందం’ తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అవుతుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు