ట్యాక్సీవాలాపై క్లారిటీ ఇచ్చాడు

ట్యాక్సీవాలాపై క్లారిటీ ఇచ్చాడు

ట్యాక్సీవాలా.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో ముందు రావాల్సిన చిత్రమిదే. చకచకా సినిమాను పూర్తి చేసి మే నెలలోనే రిలీజ్ చేయడానికి రెడీ చేశారు. మే 18న రిలీజ్ అంటూ పది రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. సినిమా భలేగా వచ్చిందని.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. కానీ ఉన్నట్లుండి సినిమా వాయిదా పడిపోయింది. తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రం జూన్‌లో వస్తుందన్నాడు. జూన్ వచ్చింది వెళ్లిపోయింది. ఆగస్టులోకి వచ్చేశాం. ‘ట్యాక్సీవాలా’ పక్కకు వెళ్లిపోయి ‘గీత గోవిందం’ విడుదలకు సిద్ధమైంది. అసలు ‘ట్యాక్సీవాలా’ టీంలో ఎవ్వరూ కూడా ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చెప్పట్లేదు. దాని ఊసే ఎత్తట్లేదు. వచ్చే రెండు నెలల్లో కూడా సినిమా వస్తుందా అన్నది సందేహంగానే ఉంది.

ఇంతకీ ఈ సినిమా ఏమైనట్లు.. ఎప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది.. ఈ విషయాలపై ఎట్టకేలకు విజయ్ దేవరకొండ స్పందించాడు. ‘గీత గోవిందం’ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అతను ‘ట్యాక్సీవాలా’ గురించి మాట్లాడాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్లే సినిమా వాయిదా పడిందన్నాడు. అంతకుముందు చేసిన వర్క్ అంతా తమకు నచ్చలేదని.. దీంతో మొత్తం పని మరోసారి చేయిస్తున్నామని.. అందుకే ఇంత ఆలస్యమని.. ఎలాంటి హడావుడి పడకుండా పని పూర్తి చేసి.. ప్రశాంతంగా విడుదల చేస్తామని.. అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల్లోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా ఎప్పుడొచ్చినా హిట్టవుతుందని.. ప్రేక్షకులు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు