దిల్ రాజు నోట.. ‘అజ్ఞాతవాసి’ మాట

దిల్ రాజు నోట.. ‘అజ్ఞాతవాసి’ మాట

దిల్ రాజు బేనర్ నుంచి గత నెలలో ‘లవర్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ఐతే దాన్ని ప్రమోట్ చేసి కాపాడాలని దిల్ రాజు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. వీకెండ్ తర్వాత ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు రాజు నుంచి ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా వచ్చింది. దీన్ని మాత్రం రాజు అంత తేలిగ్గా వదలట్లేదు. ఈ చిత్రానికి కూడా తొలి రోజు డివైడ్ టాకే వచ్చింది. వసూళ్లు ఆశాజనకంగా లేవు. కుటుంబ ప్రేక్షకుల వరకు ఈ సినిమా పర్వాలేదంటున్నారు కానీ.. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ మాత్రం ఈ చిత్రాన్ని తిరస్కరించిన మాట వాస్తవం. దీంతో వసూళ్లు పుంజుకోవట్లేదు. శని.. ఆదివారాల్లో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత మాత్రం సినిమా నిలబడలేదు.

కానీ దిల్ రాజు మాత్రం ‘శ్రీనివాస కళ్యాణం’ హిట్టే అంటున్నాడు. దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయని చెబుతున్నాడు. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజు మాట్లాడుతూ.. ‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్‌ను విశ్లేషించాడు. తాను 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్లో ఉన్నానని.. ఏ సినిమా ఏంటో.. టాక్‌ను బట్టి ఏది ఎలా ఆడుతుందో తనకు తెలుసని అన్నాడు. కొన్ని సినిమాల ఫలితమేంటో తొలి రోజే డిసైడైపోతుందని.. వసూళ్లు పడ్డాయంటే పుంజుకునే అవకాశమే లేదని.. పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు చిత్రం ‘స్పైడర్’ ఆ కోవలోనివే అని.. ఆ చిత్రాల్ని తానే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశానని.. వాటి వసూళ్లు పడుతూ వెళ్లాయే తప్ప ఏ దశలోనూ పెరగలేదని రాజు చెప్పాడు. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ అలాంటి సినిమా కాదని.. తొలి రెండు రోజుల్లో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా.. శని, ఆదివారాల్లో అన్ని చోట్లా ఫుల్స్ పడ్డాయని రాజు చెప్పాడు. హీరో నితిన్ సొంత ఊర్లోని థియేటర్లలో శనివారం ఫుల్స్ పడినట్లు తెలిసి ఆశ్చర్యపోయానని.. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చుతోందని రాజు అన్నాడు. కానీ సోమవారం బాగా డౌన్ అయిన వసూళ్ల గురించి రాజు ఏమంటాడో చూడాలి.