చంద్రబాబు సతీమణిగా ఆమె

చంద్రబాబు సతీమణిగా ఆమె

నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్‌లో కీలక పాత్రలు ఒక్కొక్క దానిపై స్పష్టత వచ్చేస్తోంది. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రకు దగ్గుబాటి రానాను ఎంపిక చేసినట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రానా ఇప్పటికే గడ్డం తీసేసి యుక్త వయసులో ఉన్న చంద్రబాబు అవతారంలోకి మారిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందటే రానా షూటింగుకి కూడా హాజరయ్యాడు.

తాజాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్రను ఎవరు చేస్తున్నది కూడా వెల్లడైంది. అక్కినేని నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించిన మలయాళ అమ్మాయి మాంజిమా మోహన్.. భువనేశ్వరిగా కనిపించనుంది. రానాతో పాటే ఆమె కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో చిత్రీకరణకు హాజరవుతున్నట్లు సమాచారం. ‘సాహసం..’ ఫ్లాప్ కావడంతో మాంజిమా మళ్లీ ఇటు వైపు చూడలేదు. ప్రస్తుతం ఆమె ‘క్వీన్’ మలయాళ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడైన నీలకంఠనే దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ముఖ్య పాత్రధారుల విషయంలో దాదాపుగా స్పస్టత వచ్చేసినట్లే. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు సుమంత్ ఎంపికయ్యాడు. ఇక దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ.. నిర్మాత హెచ్.ఎం.రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ ను నాగిరెడ్డి పాత్రలో చూడబోతున్నాం. మురళీ శర్మ చక్రపాణిగా దర్శనమివ్వనున్నాడు. ఎన్టీఆర్ మిత్రుడైన సుబ్బారావు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సచిన్ ఖేద్కర్.. నాదెండ్ల భాస్కరరావు పాత్రలో కనిపించనున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్.. హరికృష్ణ పాత్రలో నటిస్తాడని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు