దిల్ రాజు కొత్త సినిమా.. థ్యాంక్ యు

దిల్ రాజు కొత్త సినిమా.. థ్యాంక్ యు

టాలీవుడ్లో దిల్ రాజు అంత బిజీ నిర్మాత మరొకరు కనిపించరు. గత ఏడాది తన సంస్థ నుంచి ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత ఆయనది. అందులో చాలా వరకు విజయవంతం అయ్యాయి. ఈ ఏడాది కూడా అరడజను ఫీట్ సాధించాలని అనుకున్నాడు కానీ.. కుదర్లేదు. ఆయన బేనర్ నుంచి ‘లవర్’.. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు వచ్చాయి.

‘హలో గురూ ప్రేమ కోసమే’ దసరాకు విడుదలవుతుంది. దాని తర్వాత మహేష్ బాబు సినిమా ‘మహర్షి’తో పాటు ఇంకో రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా రాజు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా టైటిల్ కూడా ప్రకటించాడు. ఆ పేరు.. థ్యాంక్ యు. రాజు ప్రొడక్షన్లో ‘శతమానం భవతి’.. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు తీసిన సతీశ్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

‘శ్రీనివాస కళ్యాణం’ సక్సెస్ మీట్లో భాగంగా రాజు ఈ చిత్రాన్ని ప్రకటించాడు. సతీశ్‌ తర్వాతి సినిమా కూడా తన బేనర్లోనే ఉంటుందని ఈ చిత్ర విడుదలకు ముందే రాజు వెల్లడించాడు. ఐతే ‘శ్రీనివాస కళ్యాణం’కు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సతీశ్‌తో మళ్లీ రాజు సినిమా నిజంగానే ఉంటుందా అన్న సందేహాలు కలిగాయి. వాటికి తెరదించుతూ రాజు ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.
ఐతే ఇది సతీశ్ సొంత కథతో తెరకెక్కనున్న సినిమా కాదట. ఎవరో రాజుకు ఈ ఐడియా చెబితే.. ఆయన సతీశ్‌తో షేర్ చేసుకుని సినిమా చేద్దామా అంటే తప్పకుండా అని ఓకే చెప్పినట్లు రాజు వెల్లడించాడు. తమ బేనర్లో ‘థ్యాంక్ యు’ కూడా ఒక మంచి సినిమా అవుతుందని.. త్వరలోనే ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ మొదలవుతుందని రాజు ప్రకటించాడు. స్క్రిప్ట్ ఓకే అయ్యాక నటీనటుల వివరాలు ప్రకటిస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు