‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో ఎవరంటే?

‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో ఎవరంటే?

పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘అత్తారింటికి దారేది’. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పటికి తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది కూడా. ఈ చిత్రం ఇప్పటికే కన్నడ, బెంగాళీ భాషల్లో రీమేక్ అయింది. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు.

ఐతే తెలుగులో రిలీజైన ఐదేళ్లకు ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ కాబోతుండటం విశేషం. సీనియర్ దర్శకుడు సుందర్ ఈ చిత్రాన్ని తమిళంలో తీయబోతున్నాడు. స్టార్ హీరో శింబు కథానాయకుడిగా నటించనున్నాడు. ‘2.0’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ రీమేక్ హక్కుల్ని మంచి రేటుకు కొని తమిళంలో పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం.

తెలుగులో నదియా పోషించిన అత్త పాత్రను తమిళంలో సుందర్ సతీమణి అయిన ఖుష్బు చేయబోతోందట. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల సంగతి ఇంకా తేలలేదు. శింబు ఇంతకుముందు తెలుగు నుంచి ‘ఇడియట్’.. ‘వేదం’ లాంటి రీమేకుల్లో నటించాడు. పవన్ కళ్యాణ్ చేసిన హిందీ రీమేక్ ‘దబాంగ్’ను తమిళంలో శింబునే చేశాడు.

ఈ మూడు సినిమాలూ ఓ మోస్తరుగా ఆడాయి. మరి ‘అత్తారింటికి దారేది’ రీమేక్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ‘అత్తారింటికి దారేది’లో కథాకథనాల కంటే త్రివిక్రమ్ మార్కు హాస్య చతురత.. డైలాగ్స్.. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచి సినిమా అంత పెద్ద విజయం సాధించింది. మరి తమిళంలో ఇది ఏమేరకు వర్కవుట్ అవుతందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు