దిల్‌ రాజు గారూ... ఇంక లాగకండి

దిల్‌ రాజు గారూ... ఇంక లాగకండి

తన జడ్జిమెంట్‌ సూపర్‌ అని, అసలు తన జడ్జిమెంట్‌ గురి తప్పదని గుడ్డిగా నమ్మేసే నిర్మాత దిల్‌ రాజు. తన ప్రతి సినిమాని ఎలాగైనా హిట్‌ అనిపించడానికి అతను చేయని ప్రయత్నమంటూ వుండదు. చాలా సందర్భాల్లో యావరేజ్‌ అయి, బయ్యర్లకి నష్టాలు తెచ్చిన దిల్‌ రాజు చిత్రాలని కూడా హిట్‌లుగానే పేర్కొంటారంటే అది అతని పబ్లిసిటీ మహత్యమే. లవర్‌ చిత్రానికి కిమ్మనకుండా వుండిపోయిన దిల్‌ రాజు శ్రీనివాస కళ్యాణంతో షాక్‌ తగిలే సరికి కోలుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. మొదటి రెండు రోజుల్లో పరాజయాన్ని యాక్సెప్ట్‌ చేసేసిన దిల్‌ రాజుకి శని, ఆదివారాల్లో వసూళ్లతో ఉత్సాహం వచ్చింది.

మార్కెట్లో మరే పెద్ద సినిమా లేక ఫ్యామిలీస్‌ ఈ చిత్రాన్ని ప్రిఫర్‌ చేయడంతో 'సినిమా జనాలకి నచ్చుతోంది. మొదటి రోజు ఎందుకో తేడా టాక్‌ వచ్చింది' అంటూ దిల్‌ రాజు తన యూజువల్‌ దరువు మొదలు పెట్టేసాడు. ఇంకో అడుగు ముందుకేసి ఆడియన్స్‌ రివ్యూ అంటూ ప్రేక్షకుల చేతికి కార్డులు ఇచ్చి వారి పల్స్‌ కనుక్కుంటున్నాడట. ఆ కార్డులు పుచ్చుకుని తొంభై శాతం, వంద శాతం మందికి నచ్చేస్తోందంటూ డబ్బాలు కొడుతున్నాడు.

అయితే తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు కనీసం సోమ, మంగళవారాల్లో వసూళ్లు ఎలా వుంటాయో చూసుకుని ఈ సందడి మొదలు పెట్టి వుండాల్సింది. ఒకవైపు ఆడియన్స్‌కి వంద శాతం నచ్చేస్తోందని దిల్‌ రాజు చెబుతూ వుంటే మరోవైపు సోమవారం నాడు శ్రీనివాసకళ్యాణంకి కనీసం హైదరాబాద్‌ నడిబొడ్డులో కూడా వసూళ్లు లేకుండా పోయాయి. ప్రేక్షకుల తీర్పు స్పష్టంగానే వుంది. ఆరిపోయే ముందు వెలుగులా ఆదివారం కాస్త కాంతి ఎక్కువ కనిపించే సరికి సినిమా వెలిగిపోతోందని దిల్‌ రాజు సంబరపడ్డాడంతే. ఇక తెగే దాకా లాగకుండా నెక్స్‌ట్‌ సినిమా మీదకి దృష్టి మళ్లించేస్తే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు