యూట్యూబ్ క్వీన్.. ఈసారైనా కొడుతుందా?

యూట్యూబ్ క్వీన్.. ఈసారైనా కొడుతుందా?

చాందిని చౌదరి.. కేవలం సినిమాలు మాత్రమే ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరు అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా షార్ట్ ఫిలిమ్స్‌ను ఫాలో అయ్యే వాళ్లలో మాత్రం ఈ పేరు బాగా పాపులర్. ‘మధురం’ షార్ట్ ఫిలింతో ఆమె మామూలు ముద్ర వేయలేదు. దీంతో పాటుగా ఆమె చేసిన మిగతా షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమెను యూట్యూబ్ షార్ట్ ఫిలిం క్వీన్ అంటారు జనాలు. అందం, అభినయం రెండూ ఉన్న ఈ తెలుగమ్మాయికి సినిమాల్లో మాత్రం కలిసి రాలేదు. ‘కుందనపు బొమ్మ’.. ‘హౌరా బ్రిడ్జ్’ లాంటి సినిమాల్లో చాందిని కథానాయికగా నటించింది. ‘బ్రహ్మోత్సవం’లోనూ ఒక పాత్ర చేసింది. కానీ ఇవేవే ఆమెకు మంచి ఫలితాన్నివ్వలేదు. ఐతే ‘మను’ సినిమా తన రాత మారుస్తుందని చాందిని ధీమాగా ఉంది.

చాందినితో ‘మధురం’ తీసిన ఫణీంద్ర నరిశెట్టి ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం ‘మను’. ఈ చిత్రానికి కూడా చాందనినే కథానాయికగా ఎంచుకున్నాడు. దీని ట్రైలర్ చూస్తే చాందిని బలమైన ముద్ర వేసేలాగే కనిపించింది. ట్రైలర్ జనాల్లో బాగా క్యూరియాసిటీ తెచ్చింది. ఇందులో తాను నీల అనే అమ్మాయి పాత్ర చేశానని.. ఆ పాత్రను అర్థం చేసుకోవడానికే తనకు చాలా సమయం పట్టిందని.. అసలా పాత్రను తాను చేయగలనా అని సందేహించానని.. కానీ దర్శకుడిచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశానని చాందిని చెప్పింది. ఈ సినిమా పూర్తయి ఏడాది కావస్తోందని.. కానీ ఇప్పటికీ నీల పాత్ర తనతోనే ఉందని.. రేప్పొద్దున సినిమా చూశాక జనాలు కూడా నీల పాత్రను అలాగే తమ వెంట తీసుకెళ్తారని ధీమా వ్యక్తం చేసింది చాందిని. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కథానాయకుడిగా నటించిన ‘మను’ సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రమైనా చాందినికి సినిమాల్లో తొలి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు