షకలక శంకర్.. దెబ్బ తిన్నా ఆగడం లేదు

షకలక శంకర్.. దెబ్బ తిన్నా ఆగడం లేదు

కమెడియన్లు హీరో వేషాలపై మోజు పడటం.. ఎలాగోలా సినిమాలు సెట్ చేసుకుని బరిలోకి దిగేయడం గత కొన్నేళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఇంతకుముందు కమెడియన్లుగా పెద్ద రేంజికి వెళ్లిన వాళ్లే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న స్థాయి కమెడియన్లు కూడా హీరోలైపోతున్నారు. ఈ కోవలోనే షకలక శంకర్ కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. హీరోగా అతడి తొలి సినిమా ‘శంభో శంకర’ నెలన్నర కిందటే రిలీజైంది. దాని ఫలితం గురించి మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. రెండు కోట్లు పెడితే నాలుగు రెట్లు లాభం తెచ్చిపెట్టే సినిమా అంటూ దీని గురించి శంకర్ చాలా గొప్పలు పోయాడు కానీ.. పెట్టుబడిలో సగమైనా వెనక్కి వచ్చిందా అన్నది సందేహమే. ఈ దెబ్బతో శంకర్ హీరోగా ఇంకో సినిమా రావడం కష్టమే అనుకున్నారంతా.

కానీ అతను ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. ‘శంభో శంకర’తో పాటు మొదలైన ‘డ్రైవర్ రాముడు’ ఒక దశలో మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా ఇక లేనట్లే అని శంకర్ కూడా సంకేతాలిచ్చాడు. కానీ కొన్ని రోజుల కిందటే ఈ చిత్రాన్ని మళ్లీ మొదలుపెట్టాడు శంకర్. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే ఇప్పుడు ‘కేడీ నం.1’ అంటూ శంకర్ హీరోగా ఇంకో సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో శంకర్ పెద్ద యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అని నిర్మాత చెబుతుండటం విశేషం. జానీ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పెద్ద స్టార్ హీరోలే యాక్షన్ బాట విడిచిపెట్టి ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సెన్సిబుల్ సినిమాలు చేస్తుంటే.. కమెడియన్ అయిన శంకర్ ఇలాంటి యాక్షన్ సినిమా చేసి ఎవరిని మెప్పించాలనుకుంటున్నాడన్నది అర్థం కావడం లేదు. కామెడీతో ఆకట్టుకునే వీళ్లు.. హీరోలయ్యాక మాత్రం కామెడీ వదిలేసి ఫైట్లు, డ్యాన్సులతో మెప్పించడానికి విఫలయత్నాలు చేయడమే విడ్డూరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు