తేజు దురదృష్టం.. ఎన్టీఆర్ అదృష్టం

తేజు దురదృష్టం.. ఎన్టీఆర్ అదృష్టం

ఎవరి కోసమో తయారు తయారు చేసిన కథలు వేరెవరి దగ్గరికో వెళ్లడం కొత్తేమీ కాదు. ఇలా దారి మళ్లిన కథలు కొన్నిసార్లు అద్భుత ఫలితాలందుకుని వాటిని వదులుకున్న హీరోలు చింతించేలా చేస్తాయి. కొన్ని కథలు చేదు అనుభవాన్ని మిగిల్చి వాటిని మిస్ చేసుకున్న వాళ్లు హమ్మయ్య అనుకునేలా చేస్తాయి. దిల్ రాజు నుంచి గత ఏడాది విడుదలై భారీ విజయాన్నందుకున్న ‘శతమానం భవతి’కి ముందు అనుకున్న హీరో సాయిధరమ్ తేజ్.

కానీ ఆ చిత్రాన్ని గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడం.. అదే సమయానికి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ కూడా విడుదలవుతుండటంతో తన మావయ్యతో పోటీ పడటం ఇష్టం లేక ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా తేజు చెప్పాడు. శర్వా కథానాయకుడిగా నటించిన ‘శతమానం భవతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఫలితం చూశాక తేజు కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు.

కట్ చేస్తే ఇప్పుడు రాజు బేనర్ నుంచి ‘శ్రీనివాస కళ్యాణం’ వచ్చింది. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్ననే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. అంతిమంగా ఈ చిత్రం ఫెయిల్యూర్ అయ్యేట్లే ఉంది. నిజానికి ఈ చిత్రానికి ముందు అనుకున్న హీరో నితిన్ కాదట.

తన ప్రతి సినిమాకూ కథ రెడీ అయ్యాక అందులో హీరోగా ఇద్దరి ముగ్గురి పేర్లు రాసుకుంటానని.. అలా ‘శ్రీనివాస కళ్యాణం’కి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పేర్లు రాసుకున్నామని.. ఎన్టీఆర్‌కు కథ కూడా చెప్పామని దిల్ రాజు వెల్లడించాడు. ఐతే ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని తిరస్కరించాడా లేక తామే వద్దనుకున్నామా అన్నది మాత్రం చెప్పలేదు. నితిన్‌కు చెప్పగానే చాలా ఉత్సాహంగా ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లు రాజు వెల్లడించాడు. మొత్తానికి ‘శతమానం భవతి’ని వదులుకోవడం తేజు దురదృష్టమైతే.. ‘శ్రీనివాస కళ్యాణం’ చేయకపోవడం ఎన్టీఆర్ అదృష్టమన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు