విజయ్ దేవరకొండలో కొత్త కోణం

విజయ్ దేవరకొండలో కొత్త కోణం

ఏడాది కిందట ‘అర్జున్ రెడ్డి’ విడుదలైనప్పటి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు విజయ్ దేవరకొండ అంటే ఏంటో. ఎప్పుడూ చాలా సరదాగా.. అల్లరి మాటలతో తన అభిమానుల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాడతను. మైక్ అందుకున్నాడంటే చాలా కొంటెగా మాట్లాడుతుంటాడతను. కానీ వైజాగ్ వేదికగా జరిగిన ‘గీత గోవిందం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అందరికీ విజయ్‌లోని కొత్త కోణం కనిపించింది. అతను చాలా ఎమోషనల్ అయిపోయాడు. దాదాపు కన్నీళ్లతో మాట్లాడాడు. ఇందుక్కారణం ‘గీత గోవిందం’ నుంచి కొన్ని సీన్లు లీక్ అయి ఇంటర్నెంట్లో వైరల్ అవ్వడమే. మూడు రోజులుగా ఈ విషయంలో ఈ చిత్ర బృందం చాలా టెన్షన్ పడుతోంది. ఇంటర్నెట్ నుంచి లీకైన సీన్లు సంబంధించిన సన్నివేశాల్ని తీయించే పనిలోనే ఉంటోంది.

దీని గురించి విజయ్ స్పందిస్తూ.. తాము ఏడాది పాటు ఎంతో కష్టపడి.. ప్రాణం పెట్టి పని చేసి ఒక మంచి సినిమా అందించాలని ప్రయత్నిస్తుంటే ఇలాంటివి జరగడం బాధాకరమన్నాడు. తాను వేదిక మీదికి రావడానికి ముందు కూడా మొబైల్ చూస్తూ పైరసీ లింకుల్ని తమ టీంకు షేర్ చేస్తూ వాటిని తీయించే పనిలో ఉన్నానని.. ఇది తమకు అవసరమా అని ప్రశ్నించాడు. ‘గీత గోవిందం’ నిర్మాత అయిన బన్నీ వాస్ కూడా ఇదే పనిలో గడుపుతున్నాడని.. ఎంతో కష్టపడి తీసిన సినిమా గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి రావడం బాధాకరమని అన్నాడు. ఐతే తనను వెనక్కి లాగాలని ఎవరు ఎంతగా ప్రయత్నించినా.. తాను భయపడే ప్రసక్తే లేదని.. చిన్నప్పట్నుంచి ఉనికి కోసం, ఎదగడం కోసం, గుర్తింపు కోసం పోరాటడం అలవాటైందని.. ఇప్పుడూ అదే చేస్తానని చెబుతూ విజయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

తన కళ్లకు ఇన్ఫెక్షన్ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుని నళ్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతున్నానని.. అలాంటి సమయంలో కూడా డబ్బింగ్ థియేటరుకు వెళ్లి ఇంకో వెర్షన్ డబ్బింగ్ చెప్పానని.. ప్రేక్షకుల కోసం ఇంత చేస్తుంటే ఇలా జరగడం వేదన కలిగిస్తోందని చెప్పాడు. తన లాగే చిత్ర బృందమంతా పైకి నవ్వుతూ లోలోన బాధ పడుతోందని చెప్పాడు. ఐతే వైజాగ్‌లో ఈ ఈవెంట్‌కు వచ్చిన జనాల ఉత్సాహం చూశాక తనలోనూ జోష్ వచ్చిందన్న విజయ్.. ఆగస్టు 15న ‘గీత గోవిందం’ థియేటర్లు నవ్వులతో నిండిపోతాయని ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు