దిల్ రాజు ‘జోక్యం’పై ఆ దర్శకుడేమన్నాడంటే..

దిల్ రాజు ‘జోక్యం’పై ఆ దర్శకుడేమన్నాడంటే..

దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏమీ జరగదని అంటారు. స్క్రిప్టు దగ్గర్నుంచి అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటారని చెబుతారు. ఐతే రాజు ప్రొడక్షన్లో వచ్చిన కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో ఆయన ప్రమేయం మరింత ఎక్కువని.. ఈ సినిమాకు దాదాపుగా ఆయన ఘోస్ట్ డైరెక్షన్ చేశారని రూమర్లు వచ్చాయి.

దీనిపై దిల్ రాజు ప్రి రిలీజ్ ప్రమోషన్లలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను సినిమాకు సంబంధించి ఏవైనా సలహాలు ఇస్తా తప్ప అంతకుమించి జోక్యం చేసుకోనని.. సినిమా అనేది దర్శకుడి బిడ్డ అని రాజు అన్నాడు. అయినప్పటికీ ఈ చర్చ ఆగకపోవడంతో ఇప్పుడు స్వయంగా దర్శకుడు సతీశ్ వేగేశ్ననే ఈ విషయమై స్పందించాడు.

‘‘నా సినిమా గురించి నా కంటే ఎక్కువగా దిల్ రాజు గారు ఆలోచిస్తారు. ‘శతమానం భవతి’ నుంచి నేను ఆయన్ని చూస్తున్నా. ఆయన సినిమాను ప్రేమిస్తారు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇస్తారు. అంతే కానీ.. ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆదేశించరు. ఒకవేళ అలా అంటే ‘శతమానం భవతి’ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ చేసేవాడిని కాదు. ఈయన జోక్యం ఎక్కువగా ఉంటే.. నన్ను డామినేట్ చేస్తుంటే ఈ సినిమా చేయను కదా? ఇక్కడ ఎవరి క్రెడిట్‌ను ఎవరూ తీసుకెళ్లరు. రాజు గారి కాంపౌండ్లో అలా జరిగితే దర్శకులు బయటికి వెళ్లాక కూడా మంచి సినిమాలు ఎలా తీస్తారు? ‘శ్రీనివాస కళ్యాణం’ డైలాగులకు మంచి పేరొచ్చింది. మరి ఆ డైలాగులు నేనే రాసుకోవాలి కదా? నటీనటులకు సీన్లు నేనే వివరించాలి. రాజు గారు సీన్ బాగుందా లేదా అని సలహా ఇస్తారు. ఏదైనా మార్చాల్సి ఉంటే చెబుతారు. అప్పుడు ఇంకో సీన్ రాయాల్సింది కూడా నేనే’’ అని సతీశ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు