‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఫిక్స్

‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఫిక్స్

పోయినేడాది ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు వేరే భాషల వాళ్లనూ ఆకర్షించి రీమేక్ కూడా అవుతోందా చిత్రం. గత నెలలో రిలీజైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి దీంతో పోలిక తెచ్చారు. రెండింట్లోనూ బోల్డ్ కంటెంట్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది.

‘అర్జున్ రెడ్డి’ స్థాయిలో మేటి సినిమా అని చెప్పలేం కానీ.. ఇది కూడా దాని లాగే కమర్షియల్‌గా పెద్ద విజయమే సాధించింది. వేరే భాషల వాళ్లనూ ఆకర్షించింది. హిందీ, తమిళ భాషలు రెండింట్లోనూ దీన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో ఫాంటమ్ పిక్చర్స్ అనే సంస్థ ‘ఆర్ఎక్స్ 100’ను దీని ఒరిజినల్ డైరెక్టర్ అజయ్ భూపతితోనే రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇక తాజాగా తమిళంలోనూ ఈ చిత్రం రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. తెలుగు వాడైన ఆది పినిశెట్టి ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం విశేషం. మరో సంస్థ భాగస్వామ్యంతో అతను ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడట. తనే హీరోగా కూడా నటిస్తాడట. ఈ చిత్రాన్ని అజయ్ భూపతితోనే రీమేక్ చేయించాలని ఆది అనుకున్నాడట కానీ.. అజయ్ అందుకు నో చెప్పినట్లు సమాచారం.

మరి తమిళంలో ఈ చిత్రాన్ని ఎవరు రూపొందిస్తారో చూడాలి. తెలుగులో మాదిరి తమిళంలోనూ బోల్డ్ కంటెంట్ ఉంటుందా అన్నది డౌటే. ఎందుకంటే ఆదికి ఉన్న ఇమేజ్ వేరు. కాబట్టి బోల్డ్ కంటెంట్ కొంచెం తగ్గించే అవకాశాలున్నాయి. పాయల్ రాజ్ పుత్ పాత్రను అక్కడ ఎవరు చేస్తారన్నదీ ఆసక్తికరమే. ఇక ఆది నటించిన తెలుగు సినిమా ‘నీవెవరో’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు